నందమూరి బాలకృష్ణ అంటే.. మాస్ తరహా పాత్రలే గుర్తొస్తాయి. ఫ్యాక్షన్ కథలు ఆయనకు సూటైనట్టు ఇంకెవ్వరికీ అవ్వవు. అందుకే ఆ తరహా పాత్రలకు బాలయ్య కేరాఫ్ అడ్రస్స్ అయ్యారు. అయితే బాలయ్య టక్, టై కట్టుకుని, కార్పొరేట్ ఆఫీసులో పనిచేస్తుంటే ఎలా ఉంటుంది? కొత్తగా అనిపిస్తుంది కదా. ఈ ఆలోచన శ్రీవాస్ కి వచ్చింది. అందుకే బాలయ్యని గూగుల్ సీఈవోగా మారుస్తున్నారు.
నందమూరి బాలకృష్ణ- శ్రీవాస్ కాంబినేషన్ లో ఇది వరకు `డిక్టేటర్` సినిమా వచ్చింది. ఇప్పుడు ఈ కాంబో మరోసారి సెట్టయ్యే సూచనలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. గత కొంతకాలంగా బాలయ్య కోసం కథలు సిద్ధం చేసే పనిలో ఉన్నారు శ్రీవాస్. కార్పొరేట్ రాజకీయాల నేపథ్యంలో… శ్రీవాస్ ఓ కథ రాశారు. అది బాలయ్యకు సరిపోతుందన్నది ఆయన ఆలోచన. ఓ చిన్న ఊరు నుంచి గూగుల్ లాంటి కంపెనీకి సీఈవోగా ఎదిగిన ఓ వ్యక్తి కథ ఇది. మళ్లీ తన ఊరికి, తన దేశానికి… తను సంపాదించిన జ్ఞానాన్నీ, సంపాదననీ పంచివ్వాలనుకుంటే ఏమవుతుంది? అనేది కథ. శ్రీమంతుడు, మహర్షి ఫ్లేవర్ లో ఈ కథ సాగబోతోందని, ఓ సామాజిక అంశాన్ని ఈ కథతో బలంగా చెప్పాలనుకుంటున్నారని తెలుస్తోంది. ఈచిత్రానికి సి.కల్యాణ్ నిర్మాతగా వ్యవహరించబోతున్నారు. ప్రస్తుతం అఖండతో బిజీగా ఉన్నారు బాలయ్య. ఆ తరవాత.. గోపీచంద్ మలినేని సినిమా పట్టాలెక్కుతుంది. మరోవైపు అనిల్ రావిపూడి కూడా బాలయ్య కోసం కథ తయారు చేస్తున్నాడు. ఆ తరవాతే… శ్రీవాస్ సినిమా ఉంటుంది.