బివిఎస్ రవి రచయితగా సుపరిచితుడే. కొన్ని హిట్ సినిమాల్లో తన వాటా కూడా ఉంది. అయితే దర్శకుడిగా రాణించలేకపోయాడు. వాంటెడ్, జవాన్ సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. దాంతో ఆయన మరోసారి మెగా ఫోన్ పట్టే సాహసం చేయలేకపోయారు. అయితే ఇప్పుడు బాలకృష్ణ ఆ అవకాశం ఇచ్చినట్టు సమాచారం. బాలయ్య కోసం బివిఎస్ రవి ఓ కథ సిద్ధం చేశారని, అది బాలయ్యకూ నచ్చిందని తెలుస్తోంది. త్వరలోనే ఈ కాంబినేషన్ గురించిన కబురు బయటకు రానుంది.
బాలయ్య రవికి అవకాశం ఇవ్వడానికి ప్రధానమైన కారణం.. `అన్ స్టాపబుల్`. ఆహాలో ప్రదర్శితమైన ఈ టాక్ షోకు అనూహ్య స్పందన వచ్చింది. ఈ షోతో… బాలయ్య మరింత మందికి చేరువయ్యాడు. `అన్ స్టాపబుల్`తో బాలయ్యకు కొత్త తరహా ఇమేజ్ వచ్చింది. ఈ షో తెర వెనుక సూత్రధారి బివిఎస్ రవి. షోని సమర్థవంతంగా నడిపిన రవి పనితీరు బాలయ్యకు నచ్చిందని, అందుకే ఈ ఆఫర్ ఇచ్చాడని తెలుస్తోంది. రవి సామర్థ్యం, తన పరిచయాలతో… హీరోలకు కథలు చెప్పి ఒప్పించడం వరకూ ఓకే. ఇది వరకు కూడా ఇలానే అవకాశాలు అందుకొన్నాడు. కానీ… ఆ అవకాశాల్ని నిలబెట్టుకోవడంలో మాత్రం రవి తడబడుతున్నాడు. మరి ఈసారి ఏం చేస్తాడో? బాలయ్య ఛాన్స్ ఇచ్చినా ఇప్పటికిప్పుడు ఈ ప్రాజెక్ట్ సెట్ కి వెళ్లదు. ప్రస్తుతం గోపీచంద్ మలినేనితో ఓసినిమా చేస్తున్నాడు బాలయ్య. ఆ తరవాత.. అనిల్ రావిపూడి సినిమా ఉంది. బోయపాటి శ్రీను కూడా లైన్లో ఉన్నాడు. ఇవన్నీ పూర్తయ్యాకే రవితో ప్రాజెక్టు ఉంటుంది.