నందమూరి బాలకృష్ణ – కె.ఎస్. రవికుమార్ కాంబినేషన్లో ఇటీవలే ఓ సినిమా పట్టాలెక్కింది. వచ్చే నెలలో షూటింగ్ మొదలవుతుంది. ఇందులో బాలయ్య పోలీస్ పాత్రలో కనిపించబోతున్నాడు. ఇది వరకు బాలయ్య కోసం కె.ఎస్.రవికుమార్ ఓ కథ రెడీ చేశాడు. అయితే ఆ కథని పక్కన పెట్టేశారు. అందులోనూ బాలయ్య ది పోలీస్ పాత్రే. కె.ఎస్ ముందు తయారు చేసిన కథలో పోలీస్ పాత్ర బాలయ్యకు బాగా నచ్చిందని, దాన్ని అలానే ఉంచి – దాని చుట్టూ నేపథ్యాన్ని మార్చారని సమాచారం. పాత కథలో పొలిటికల్ అంశాలు ఎక్కువగా ఉండేవి. వాటిని ఇప్పుడు పూర్తిగా తీసేసి – కొత్త సన్నివేశాలు రాసుకున్నారు. ఈ సినిమా కోసం ‘రూలర్’, ‘క్రాంతి’ అనే పేర్లు పరిశీలనలో ఉన్నాయి. బాలయ్య ఓటు ‘రూలర్’కే అని, ఇదే పేరు ఖరారు చేసే అవకాశాలున్నాయని తెలుస్తోంది. ఇందులో ఇద్దరు కథానాయికలకు చోటుంది. వాళ్ల పేర్లు కూడా త్వరలోనే ప్రకటిస్తారు.