బాలకృష్ణ ఒక్కటంటే ఒక్క ట్వీట్ చేశారు. హెల్త్ వర్శిటీకి ఎన్టీఆర్ పేరు తొలగించడంపై మండిపడ్డారు. అంతే వైసీపీ నేతలకు అదే రోజూ కల్లోకి వస్తున్నట్లుగా ఉంది. మూడు రోజులుగా బాలకృష్ణను తిట్టిన వారు తిట్టినట్లుగానే ఉన్నారు. ఒకరి తర్వాత ఒకరు తెరపైకి వస్తున్నారు. అసభ్యంగా మాట్లాడుతున్నారు. కొడతామని బెదిరిస్తున్నారు. రోజా లాంటి వాళ్లు ఫ్లూటు అంటూ డైలాగులు కూడా మార్ఫింగ్ చేసి చెప్పారు. అయితే బాలకృష్ణ మాత్రం తన పని తాను చేసుకుంటున్నారు.
బాలకృష్ణ స్పందనపై వైసీపీలో ఇంత స్పందన ఎందుకు అనేది.. చాలా మందికి అర్థం కాలేదు కానీ వైసీపీలో ఓ స్థాయిలో ఉండే వారందరికీ అర్థమైపోయింది. బాలకృష్ణ చేసిన ట్వీట్.. పైస్థాయిలోని వారికి ఆగ్రహం తెప్పించింది. తమను అంత మాట అంటారా .. అంతకు పది మాటలు అనాల్సిందేనని సూచనలు వచ్చాయి. ఆ సూచనలు నేరుగా ఎప్పుడు ఎవరు మీడియాతో మాట్లాడాలి.. ఎవరు సోషల్ మీడియా పోస్టులు పెట్టాలి.. ఎలా పెట్టాలన్నదానిపై స్పష్టమైన కార్యాచరణలో పార్టీ ఆఫీసు నుంచి సందేశాలు వెళ్తున్నాయి. ఆ ప్రకారం వారు స్పందిస్తున్నారు.
వైసీపీలో పదవులు పొందిన నేతలెవరకీ స్వేచ్చ లేదు. వారి స్వాతంత్రం అంతా హైకమాండ్ దగ్గర ఉంటుంది. వారు పదవుల్లో ఉంటారనే పేరే కానీ అధికారవిధుల్లో ఎక్కడా కనిపించరు. వారి పేరు మీద అసలు పని సలహాదారు చేస్తారు. పదవుల్లో ఉన్న వారు ఏం చేస్తారంటే.. పార్టీ హైకమాండ్ నుంచి వచ్చే బూతుల ప్రసంగాలను చదివి వినిపిస్తూ ఉంటారు. ఇప్పుడు వారి డ్యూటీ బాలకృష్ణను విమర్శించడం. అదే చేస్తున్నారు.