కష్టం వచ్చినప్పుడు ఆదుకునేవాడే అసలైన రాజకీయ నాయకుడు. ఆ నాయకత్వ లక్షణాలు తనకు ఉన్నాయని నందమూరి బాలకృష్ణ నిరూపించారు. అసాధారణ వర్షాలతో అతలాకుతలమైన హిందూపురం నియోజకవర్గంలోనే మకాం వేసి మరీ సహాయ కార్యక్రమాలు పర్యవేక్షిస్తున్నారు. షూస్‌కు మరకలు అవుతాయని.. ఇస్త్రి బట్టలు నలిగిపోతాయని ఆయన అనుకోలేదు. మోకాలు లోతు నీళ్లలో ప్రజల్ని పరామర్శించారు. వారికి నిత్యావసరాలు అందించారు. అప్పటికప్పుడు సొంత నిధులతో సహాయ కార్యక్రమాలు చేపట్టారు. బాలకృష్ణ సహాయ కార్యక్రమాలు అక్కడి ప్రజల్ని విశేషంగా ఆకట్టుకున్నాయి.
నిజానికి బాలకృష్ణహిందూపురం ఎమ్మెల్యే అయినా ఎప్పుడూ అక్కడే ఉండరు. ఆయన ఎక్కువగా హైదరాబాద్ లో ఉంటారు. ఆయన తరపున పీఏలు పనులు చక్కబెడుతూంటారు. అయితే ఎమ్మెల్యేగా ప్రజలకు అందించాల్సిన సేవల విషయంలో ఏ మాత్రం రాజీ పడరు. తాను రావాల్సినప్పుడు తాను ఖచ్చితంగా వస్తారు. తన అవసరం లేనప్పుడు సిబ్బందితో పనులు చేయించేస్తారు. హిందూపురం జిల్లాను హిందూపురం కేంద్రంగా చేయడానికి ఆయన పోరాడారు.ఇప్పుడు ప్రజలు కష్టాల్లో ఉంటే వచ్చేశారు.
అయితే వైసీపీ నేతలు మాత్రం తరచూ బాలకృష్ణ విషయంలో వివాదాస్పదంగా వ్యవహరిస్తూంటారు. అనుచితమైన కామెంట్లు చేస్తూంటారు. కనిపించడం లేదని పోలీస్ స్టేషన్లలో హిజ్రాలతో కేసులు పెట్టిస్తూంటారు. అయితే బాలకృష్ణ అంటే ఏంటో అక్కడి ప్రజలకు అర్థమైపోయింది. కరోనా సమయంలో సొంత డబ్బులతో ఆస్పత్రులను బాగు చేయించారు. ఆదుకున్నారు. ఇప్పుడు వరదల విషయంలోనూ అండగా నిలిచారు.