హిందూపురం నియోజకవర్గంలో వైసీపీ కార్యకర్తలు తనను అడ్డుకోవడంపై ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఫైరయ్యారు. ఎప్పుడు హిందూపురం వెళ్లినా.. కార్యక్రమాల్లో పాల్గొని… ఎలాంటి రాజకీయ స్టేట్మెంట్లు ఇవ్వకుండా వచ్చే బాలకృష్ణ.. ఈ సారి మాత్రం.. రూటు మార్చారు. భారీ ర్యాలీతో హిందూపురంలో పర్యటిస్తున్న బాలకృష్ణను.. వైసీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. కాసేపు ఉద్రిక్తత ఏర్పడటంతో.. పోలీసులు వారిని అక్కడ్నుంచి తరలించారు. ఈ ఘటనపై.. హిందూపూర్‌లో ప్రత్యేకంగా ప్రెస్‌మీట్ పెట్టిన బాలకృష్ణ… ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. తన కాన్వాయ్కి అడ్డుపడ్డ వైసీపీ కార్యకర్తల విషయంలో… తాను కను సైగ చేసి ఉంటే పరిస్థితి ఎక్కడికి దారి తీసేదని ప్రశ్నించారు.
మౌనం చేతగాని తనం అనుకోవద్దు.. చట్టంపై మాకు గౌరవం ఉందన్నారు. ఒకే రాష్ట్రం ఒకే రాజధానితో అభివృద్ధి సాధ్యమని.. దేశంలో ఎక్కడైనా రాజధాని ఒకే చోట ఉంటుందని గుర్తు చేశారు. రాష్ట్రంలో అంతా రివర్స్ పాలన సాగుతోందన్నారు. నాడు తండ్రి మండలిని పునరుద్ధరిస్తే.. నేడు తనయుడు రద్దు చేస్తున్నాడని.. తండ్రి ఆశయాలను నెరవేరుస్తానని అధికారంలోకి వచ్చి నీరుగారుస్తున్నాడని జగన్ పై మండిపడ్డారు. మండలి చైర్మన్ పట్ల మంత్రుల భాష అభ్యంతరకరంగా ఉందన్నారు. టీడీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు కానీ… ఇప్పుడు కానీ.. బాలకృష్ణ… పొలిటికల్ కామెంట్లకు దూరంగా ఉంటూ వస్తున్నారు. నియోజకవర్గ అభివృద్ధి కోసమే.. ఆయన సమయం కేటాయిస్తూంటారు.
అయితే.. బాలకృష్ణ.. ఇటీవలి కాలంలో నియోజకవర్గంలో పర్యటిస్తూంటే.. వైసీపీ నేతలు ఉద్దేశపూర్వకంగా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. గతంలోనూ అలాగే జరిగింది. పోలీసులు రక్షణ ఏర్పాట్లు కల్పించకపోవడంతో.. టీడీపీ నేతలే.. రక్షణ ఏర్పడి .. భద్రతా ఏర్పాట్లు చేసుకున్నారు. ఇప్పుడు .. వైసీపీ కార్యకర్తలు నేరుగా బాలకృష్ణ కాన్వాయ్ మీదకొచ్చేశారు. దీంతో ఆయన రాజకీయ పరంగా ఎదురుదాడి ప్రారంభించినట్లుగా భావిస్తున్నారు.