అఖండ తరవాత బాలకృష్ణ సినిమాలపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. అన్ స్టాపబుల్ తో ఆయన ఫ్యామిలీ ఆడియన్స్కి కూడా దగ్గరయ్యారు. అందుకే బాలయ్య తన సినిమాలపై మరింత శ్రద్ధ తీసుకొంటున్నారు. ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో భగవంత్ కేసరిగా ముస్తాబవుతున్న సంగతి తెలిసిందే. దసరాకి ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారు. ఈ నెలాఖరులోగా షూటింగ్ పూర్తి చేయాలన్నది ప్లాన్.
ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లో సాగుతోంది. బాలయ్య, రాం పాల్, ఇతర ఫైటర్లపై ఓ భారీ ఫైట్ తెరకెక్కిస్తున్నారు. వెంకట్ మాస్టర్ ఈ ఫైట్ కంపోజ్ చేశారు. పది రోజుల పాటు ఈ యాక్షన్ సీన్ ని తీర్చిదిద్దుతారు. ఆ వెంటనే హైదరాబాద్లో వేసిన ప్రత్యేక సెట్లో ఓ గీతాన్ని రూపొందిస్తారు. దాంతో షూటింగ్ పూర్తవుతుంది. కాజల్ కథానాయికగా నటిస్తోంది. శ్రీలీల బాలయ్య కూతురుగా కనిపించనుంది. తమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. ఇటీవలే టీజర్ విడుదలైంది. దానికి మంచి స్పందనే వస్తోంది. త్వరలో ఓ పాటని విడుదల చేయాలని చిత్రబృందం భావిస్తోంది.