అనిల్ రావిపూడిది కామెడీ మార్క్. ఆయన వినోద భరిత చిత్రాలే తీశారు. నందమూరి బాలకృష్ణతో రావిపూడి సినిమా అనగానే కచ్చితంగా ఎంటర్టైన్మెంట్ సినిమానే అనుకొంటారు. కానీ.. వాళ్లందరికీ టైటిల్ తో షాకిచ్చాడు రావిపూడి. ‘భగవంత్ కేసరి’ అనే పవర్ ఫుల్ పేరు పెట్టాడు. ఇప్పుడు టీజర్‌తో మరో షాక్ ఇచ్చాడు. అవుట్ అండ్ అవుట్ ఎనర్జరిట్, యాక్షన్ టీజర్‌ని వదిలాడు. బాలయ్య నెవర్ బిఫోర్ అవతార్‌లో.. దర్శనమివ్వడం అన్నింటికంటే మించిన స్వీట్ షాక్.
బాలయ్య పుట్టిన రోజు సందర్భంగా ‘భగవంత్ కేసరి’ టీజర్ బయటకు వచ్చింది. నిమిషం నిడివి ఉన్న టీజర్లో బాలయ్య విశ్వరూపం చూపించారు. బాలయ్య సెటిల్డ్ గా డైలాగ్ లు చెబితే ఎంత పవర్ ఫుల్‌గా ఉంటుందో తెలిసిందే. ఈసారీ.. అలానే సెటిల్డ్ గానే శక్తిమంతమైన సంభాషణలు పలికించారు. ఆయన బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలివరీ రెండూ కొత్తగానే ఉన్నాయి. ‘ఈ పేరు శానా యేండ్లు యాదుంటది’ అంటూ బాలయ్య చెప్పిన డైలాగ్ హైలెట్. టీజర్లో యాక్షన్ కే పెద్ద పీట వేశారు. ఇద్దరు హీరోయిన్లు (శ్రీలీల, కాజల్) ఉన్నా వాళ్లని చూపించలేదు. విలన్ గా అర్జున్ రాంపాల్ ఎంట్రీ లేదు. బాలయ్య బర్త్ డే కానుక కాబట్టి.. ఇది బాలయ్య స్పెషల్ అనుకోవాలి. తమన్ ఎప్పటిలానే.. ఆర్.ఆర్. అదరగొట్టాడు. మొత్తానికి బాలయ్య ఫ్యాన్స్ కి అదిరిపోయే బర్త్‌డే ట్రీట్ ఇచ్చాడు అనిల్ రావిపూడి. దసరా కానుకగా ఈ చిత్రాన్ని విడుదల చేస్తారు.