సమరసింహారెడ్డి, నరసింహనాయుడు, లక్ష్మీనరసింహ, గౌతమిపుత్ర శాతకర్ణి, జై సింహా… సంక్రాంతికి వచ్చిన మ్యాగ్జిమమ్ బాలకృష్ణ సినిమాలు బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాలు నమోదు చేశాయి. బాలకృష్ణ కెరీర్లో గుర్తుంచుకోదగ్గ చిత్రాలుగా నిలిచాయి. సెంటిమెంట్ లెక్కన విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారో? సినిమా అప్పటికి రెడీ అవుతుందో? తండ్రి ఎన్టీఆర్ జీవితకథతో రూపొందిస్తున్న సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతి పండక్కి ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని బాలకృష్ణ భావిస్తున్నారట! తేజ దర్శకత్వంలో విష్ణు ఇందూరి, సాయి కొర్రపాటిలతో కలిసి బాలకృష్ణ నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ ఆగస్టు నెలలో ప్రారంభం కానుంది. ఎం.ఎం. కీరవాణి సంగీత దర్శకుడిగా వర్క్ చేస్తున్న ఈ సినిమాలో ఆర్టిస్టుల సెలక్షన్ ఇంకా పూర్తి కాలేదు. ఎన్టీఆర్ భార్య బసవతారకం పాత్రలో నిత్యా మీనన్ నటించడం లేదని స్పష్టమైంది. ఆగస్టులోపు ఆర్టిస్టులను ఎంపిక చేస్తామనే ధీమా చిత్రబృందంలో కనబడుతోంది. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమా వస్తే వరుసగా నాలుగో ఏడాది బాలకృష్ణ సినిమా విడుదలైనట్టు అవుతుంది. డిక్టేటర్, గౌతమిపుత్ర శాతకర్ణి, జై సింహా చిత్రాలు సంక్రాంతికి విడుదలయ్యాయి.