సినిమా వాళ్ళతో పాటు ఇంకా చాలా మంది ప్రజాప్రతినిధులుగా ఎన్నికవుతున్నారు, ఎంపికవుతున్నారు. కానీ వాళ్ళకు మాత్రం ఆ పదవులు కేవలం హోదా చూపించుకోవడం కోసమే. అంతకుమించి వాళ్ళు ప్రజలకు చేసేది ఏమీ ఉండదు. ఇది నిజం. ప్రజలకు ప్రత్యక్షంగా సంబంధం లేని రాజ్యసభ సభ్యుడిగా చిరంజీవి ఉన్నాడు కాబట్టి …ఆయన ఏం ప్రజా సేవ చేస్తున్నాడో? ఏ ప్రజలకు సేవ చేస్తున్నాడో? రాజ్యసభ సభ్యుడి పదవికి చిరంజీవి ఏం న్యాయం చేస్తున్నాడో తెలుసుకోవడం కూడా కష్టమే. కానీ నందమూరి బాలకృష్ణవారు ఎమ్మెల్యే కాబట్టి ఆయన చేస్తున్న పెజాసేవ మొత్తం మీడియా కంటికి ప్రత్యక్షంగా కనిపిస్తోంది. ప్రజలకు కూడా అర్థమవుతోంది. సినిమాలలో బాలయ్య చేసిన ప్రజాసేవను చూసి….. ముఖ్యమంత్రులను, పెద్ద పెద్ద విలన్స్‌ని ఎదిరించి మరీ బాధిత ప్రజల కోసం ఆయన పాటుపడిన విధానం చూసి హిందూపురం ప్రజలు బాలయ్యను ఎమ్మెల్యేని చేసినట్టున్నారు.
కానీ రీల్ లైఫ్‌కి, రియల్ లైఫ్‌కి చాలా తేడా ఉంటుందిగా. వంద సినిమాలు పూర్తి చేసిన బాలయ్యకు…సినిమాలు కంప్లీట్ చేయడానికే ఆయన టైం సరిపోవడం లేదు. మరిక హిందూపురం ప్రజలకు అందుబాటులో ఎలా ఉండగలడు? అందుకే తన సామంతుడిగా అక్కడ తన పిఎని పెట్టాడు. కానీ ఆయనగారు మాత్రం కనకపు సింహాసనమున…..అనే తరహాలో టిడిపి నేతలు, కార్యకర్తలకు కూడా చుక్కలు చూపించడంతో మీడియాలో రచ్చ అయింది. ఆయన మాటలు….సారీ….బూతులు వింటుంటేనే ఆయన సంస్కారం ఏపాటిదో తెలుస్తూ ఉంది. అలాంటి వ్యక్తి బాలయ్యకు సన్నిహితుడంటే బాలయ్య ఇమేజ్‌కి కూడా అది నష్టం చేసేదే. కానీ బాలయ్య పిఎ మాటలు వింటుంటే మాత్రం కమిషన్లు, లంచాల రూపంలో ఎమ్మెల్యేలకు ఏ స్థాయి ఆమ్యామ్యాలు అందుతాయో మరోసారి నెటిజనులకు తెలిసొచ్చింది. ఎమ్మెల్యేగా బాలయ్యను తొలగించండి అని అడిగే దమ్ము ఎవ్వరికీ లేదు. కనీసం ఆయన సామంతుడిని అయినా కదిలించగలరేమో చూడాలి. రికార్డెడ్ వీడియోలో ఆయన బూతులు విన్నవాళ్ళకు మాత్రం జుగుప్స కలుగుతోంది. మనుషులను మనుషుల్లా చూడలేని వ్యక్తి ప్రజాప్రతినిధికి ప్రతినిధిగా హిందూపురంలో ఉన్నాడన్న విషయం ఎవ్వరికైనా అర్థమవుతోంది. మరి ఈ బాలయ్య పిఎ టార్చర్ నుంచి హిందూపురం ప్రజలకు విముక్తి ఎప్పుడో? ఇలాంటి అనుభవాల తర్వాత అయినా సినిమావాళ్ళు, బిజినెస్ పీపుల్….ఇంకా చాలా మంది పార్ట్ టైం పొలిటీషియన్స్ లాంటి వాళ్ళను కాకుండా కాస్త ప్రజలకు అందుబాటులో ఉండే నాయకులను ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎన్నుకుంటారేమో చూద్దాం.