బాలకృష్ణ ఖాతాలో మరో సినిమా చేరింది. అదే `రామానుజాచార్య`. బాలయ్యతో ఈ సినిమా చేస్తానని ఇటీవల సి.కల్యాణ్ ప్రకటించారు. ఈసినిమాకి సంబంధించిన ఆసక్తికరమైన అప్డేట్ ఇది.
సి.కల్యాణ్ ఇటీవల బాలకృష్ణని కలిశారు. ‘మీతో ఓ సినిమా చేయాలి..’ అని అడిగారు. దానికి బాలయ్య కూడా `సరే` అన్నారు. అప్పటి నుంచీ…బాలయ్య కోసం ఓకథ వెదుతున్నారు. ఆమధ్య రచయిత భారవితో సి.కల్యాణ్ భేటీ వేస్తే… ‘రామానుజాచార్య’ కథ బయటకు వచ్చింది. ఇలాంటి సినిమాలు చేయడానికి బాలయ్య కూడా ఆసక్తి చూపిస్తారు కాబట్టి, ఈ సినిమాని పట్టాలెక్కించాలని సి.కల్యాణ్ భావించారు. దాంతో… బాలయ్య కూడా ఈ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇప్పుడు ఈ కథపై కసరత్తులు జరుగుతున్నాయి. ఈ సినిమాకి కె.రాఘవేంద్రరావు దర్శకత్వం వహించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఎందుకంటే… ఈ కాలంలో.. ఇలాంటి కథని మెప్పించే దర్శకుడు ఆయనొక్కడే. భారవితో ఆయనది సుదీర్ఘ ప్రయాణం. ఇద్దరిదీ హిట్ కాంబినేషన్. కాబట్టి.. ఈ ప్రాజెక్టు రాఘవేంద్రరావే డీల్ చేసే అవకాశం ఉంది. ప్రస్తుతం రాఘవేంద్ర రావుతో ఈ ప్రాజెక్టుకు సంబంధించిన చర్చలు జరుగుతున్నాయి.
బాలకృష్ణ – రాఘవేంద్రరావు కాంబోలో.. ‘పాండు రంగడు’ వచ్చింది. కానీ అది ఫ్లాప్. ఆ సినిమా అప్పట్లోనే చాలా ట్రోలింగ్ కి గురైంది. అందుకే.. ఈసారి ‘రామానుజాచార్య’ని జాగ్రత్తగా చేయాల్సి ఉంటుంది. కథ పూర్తిగా సిద్ధమయ్యాక.. బాలయ్య – రాఘవేంద్రరావు ల మధ్య చర్చలు మొదలవుతాయి. ఆ తరవాత.. ఈ సినిమాని ఎప్పుడు? ఎలా పట్టాలెక్కించాలన్న విషయంపై ఓ నిర్ణయానికి వస్తారు.