నారా రోహిత్ అనగానే సెన్సిటీవ్ కథలే గుర్తొస్తాయి. బాణం, ప్రతినిధి, అసుర, రౌడీ ఫెలో… ఇలా కొత్త కొత్త కథలు ఎంచుకొని ప్రయాణం సాగించాడు. మధ్య మధ్యలో ఫైటింగులకు దిగినా – పూర్తి స్థాయి కమర్షియల్ సినిమా ఏం చేయలేదు. ఫ్లాపులు ఎదురవుతున్నా…. మాస్ మసాలా అంశాల జోలికి వెళ్లలేదు. ఈసారి మాత్రం అలాంటి కథలపై మక్కువ పెంచుకొన్నాడు. అందులో భాగంగా చేసిన సినిమానే ‘బాలకృష్ణుడు’. పవన్ మల్లెల దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఈనెల 24న విడుదల అవుతోంది. ఈరోజు హైదరాబాద్‌లో పాటల్ని విడుదల చేశారు. దాంతో పాటు ట్రైలర్ కూడా బయటకు వచ్చేసింది. పక్కా కమర్షియల్ అంశాలతో సాగే సినిమా ఇదన్న విషయం ట్రైలర్ చూస్తే తెలిసిపోతోంది. ఫ్యాక్షన్ నేపథ్యం, ఓ ఫ్లాష్ బ్యాక్, మేనకోడల్ని కాపాడే హీరో, మధ్యలో బకరా లాంటి పాత్ర, మాసీ డైలాగులు, పాటలు.. ఇలా పక్కా కమర్షియల్ ప్యాకేజీ సెట్ చేశాడు దర్శకుడు. రోహిత్ ని ఈ టైపు కథల్లో చూడ్డం కొత్తే. అక్కడక్కడ బొద్దుగా, కొన్ని చోట్ల కాస్త స్లిమ్‌గా కనిపించాడు రోహిత్. మణిశర్మ ఆర్.ఆర్ గురించి ప్రత్యేకంగా చెప్పుకొనేదేముంది? టెక్నికల్ టీమ్ సపోర్ట్ ఈ సినిమాకి చాలా ఉంది. కథ, కథనాల్లో వైవిధ్యం ఉండీ, తనకిచ్చిన కొత్త పాత్రలో రోహిత్ సెట్ అయితే గనుక… బాలకృష్ణుడు ని చూసేయొచ్చు.