బాలాపూర్ గణనాథుడి లడ్డూ మరోసారి రికార్డ్ ధర పలికింది. నిమజ్జనం సందర్భంగా మంగళవారం ఉదయం లడ్డూ వేలం నిర్వహించగా..గతేడాది కన్నా మూడు లక్షలు అదనంగా పలికింది.
ఈ ఏడాది 30లక్షల ఒక వెయ్యి రూపాయలకు బాలాపూర్ గణేషుడి లడ్డూను స్థానికుడైన కొలను శంకర్ రెడ్డి దక్కించుకున్నారు. వేలం పాట రూ. 1,116తోప్రారంభం కాగా.. పోటాపోటీగా సాగిన వేలంలో కొలను శంకర్ రెడ్డి లడ్డూను దక్కించుకున్నారు. వేలం అనంతరం కొలను శంకర్ రెడ్డి బాలాపూర్ ఉత్సవ కమిటీ సభ్యులకు డబ్బును అందజేశారు. గతేడాది దాసరి దయానంద్ రూ.27లక్షలకు స్వామి వారి లడ్డూను వేలంలో దక్కించుకొన్నారు.
బాలాపూర్ గణేషుడి లడ్డూ వేలంపాట 30ఏళ్లుగా కొనసాగుతూ వస్తోంది. బాలాపూర్ ప్రధాన చౌరస్తాలోని బొడ్రాయి వద్ద వేలంపాటను ఆనవాయితీగా నిర్వహిస్తూ వస్తున్నారు గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు. మొదటి ఏడాది 1994లో నిర్వహించిన లడ్డూ వేలంపాటలో 450లకు దక్కించుకోగా.. అప్పటి నుంచి ప్రతీ ఏటా వేలంపాట రికార్డ్ స్థాయిలో పలుకుతోంది.