బాలు – ఇళయరాజాల మధ్య మంచి దోస్తీ ఉంది. వీరిద్దరిదీ యాభై ఏళ్ల అనుబంధం. బాలు పాడిన అపురూప గీతాల్లో దాదాపు 80 శాతం సూపర్ హిట్స్ ఇళయరాజా స్వరపరిచినవే. అయితే… ఆమధ్య ఈ అనుబంధానికి బ్రేక్ పడింది. `నా పాటలు నా అనుమతి లేకుండా పాడడానికి వీల్లేదు` అంటూ ఇళయరాజా బాలుపై ఆగ్రహం వ్యక్తం చేయడం, ఈ గొవడ కోర్టు వరకూ వెళ్లడం జరిగాయి. కొన్ని వేదికలపై ఇళయరాజా పాటల్ని బాలు పాడలేదు కూడా. అయితే ఆ వివాదం సద్దుమణిగింది. ఇప్పుడు ఇదివరకటిలా ఇద్దరూ దోస్తులు అయిపోయారు. ఈ ఎపిసోడ్ గురించి మరోసారి గుర్తు చేసుకున్నారు బాలు. ఈరోజు ఓ ప్రయివేటు కార్యక్రమం నిమిత్తం హైదరాబాద్ వచ్చారు బాలు. ఈ సందర్భంగా ఇళయరాజా తో గొడవ మరోసారి చర్చకు వచ్చింది. వాటిపై బాలు స్పందించారు.
తమ మధ్య ఎప్పుడూ ఏ గొడవలూ లేవని, ఓ టెక్నికల్ సమస్య వల్ల చిన్న ఇద్దరి అనుబంధానికీ చిన్న విరామం వచ్చిందని, ఇప్పుడు అదంతా సమసి పోయిందని చెప్పారు. సోషల్ మీడియా వల్ల జనాలకు ఏది నిజమో, ఏది అబద్దమో తెలియకుండా పోతోందని, తామిద్దరి కంటే బయటి వ్యక్తులు ఎక్కువ మాట్లాడడం వల్ల తమ సమస్య పెద్దదిగా కనిపించిందని చెప్పుకొచ్చారు. “మేమిద్దరం ఒకరితో ఒకరు కలిసి పనిచేయడానికి ఎప్పుడూ సిద్ధంగానే ఉన్నాం. తన పిలుపుకోసం నేను ఎదురుచూశాను. ఆయన పిలిచారు. ఇద్దరం కలిసి పనిచేయడం మొదలెట్టాం. నేను ఆలపించిన గీతాల్లో సగానికి పైగా ఇళయరాజా స్వరపరిచినవే. ఆ పాటలు పాడకుండా ఎలా ఉండగలను? తాను సంగీత దర్శకత్వం వహిస్తున్న రెండు చిత్రాల్లో పాటలు కూడా పాడాను” అని చెప్పుకొచ్చారు బాలు. మొత్తానికి ఇద్దరు దిగ్గజాల మధ్య దూరం చెరిగిపోయింది. అంతకంటే ఈ సంగీత ప్రపంచానికి కావాల్సిందేముంది?