ఎప్పుడూ వివాదాలకూ, వివాదాస్పద అంశాలకూ దూరంగా ఉండే వ్యక్తి ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం. అయితే ఎందుకో ఆయనకు మన హీరోయిన్లపై కోపం వచ్చింది. వాళ్ల వస్త్రధారణపై ఆయన గళం విప్పారు. “అంగాంగ ప్రదర్శన చేస్తేనే అవకాశాలు వస్తాయా.? అవకాశాల కోసం ఓ స్త్రీ పాత్రధారి ఇంత దిగజారిపోవాలా.?“ అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
తెలుగు సినిమా సాంప్రదాయాల్ని స్త్రీ పాత్రధారి వస్త్రధారణతో ఇంత భ్రష్టు పట్టించేస్తున్నారన్నది ఆయన ఆవేదన.గతంలోనూ సినిమాలు వచ్చేవని, కానీ హీరోయిన్లు మరీ ఇంత దిగజారి నటించలేదని, కానీ ఇప్పుడు స్త్రీ జాతి సిగ్గు పడేలా తెరపై స్త్రీ పాత్రధారుల వస్త్రధారణ ఉంటోందనీ, ఇలా స్పందించినందుకు హీరోయిన్లు తనని తిట్టినా ఫర్వాలేదన్నారు బాలు.
అయితే… తప్పంతా హీరోయిన్లదే అన్న భావన బాలు మాటల్లో కనిపిస్తుంది. కానీ ఓ కథానాయిక తెరపై ఎలా కనిపించాలన్నది దర్శకుడి అభిరుచిని బట్టి ఉంటుంది. ఒక్కో దర్శకుడి ఫ్రేములో హీరోయిన్లు ఒక్కోలా కనిపిస్తారు. ఓ సినిమాలో సంప్రదాయ దుస్తుల్లో అలరించిన నాయిక, మరో సినిమాలో గ్లామర్ పాత్రలో హల్ చల్ చేస్తుంది. ఇదంతా… పాత్రని బట్టి, ఆ పాత్రని దర్శకుడు తీర్చిదిద్దిన విధానాన్ని బట్టి ఉంటుంది. ఏ కథానాయిక సెట్ కి తన కాస్ట్యూమ్ ని తనే తీసుకెళ్లదు. కాకపోతే `ఇలాంటి దుస్తులు నేను వేసుకోను` అని చెప్పే హక్కు మాత్రం కథానాయికకు ఉంది. కానీ.. అంత ధైర్యం ఎవరికీ లేదు. ఎందుకంటే అలా ధిక్కార స్వరం వినిపిస్తే… మరుసటి సినిమాల్లో తమకు అవకాశాలు రావన్నది వాళ్లభయం. సో.. ఈ విషయంలో కేవలం కథానాయికల్ని నిందించాల్సిన పనిలేదు. దర్శకులకూ ఇందులో వాటా ఉంది. ముందు దర్శకుల్ని మందలించి, ఆ తరవాత… హీరోయిన్ల విషయం ప్రస్తావనకు తెస్తే బాగుండేది.