నందమూరి నటసింహం బాలకృష్ణకు ఆయన మనవడు దేవాన్ష్ ఓ ముద్దు పేరు పెట్టాడు. అదేంటో తెలుసా? ‘గోల తాతయ్య’. నిజమేనండీ బాబూ… బాలయ్యను దేవాన్ష్ ‘గోల తాతయ్య’ అని పిలుస్తాడట. ఈ విషయాన్ని స్వయంగా బాలకృష్ణ పెద్ద కుమార్తె బ్రాహ్మణి స్వయంగా చెప్పారు. నారా లోకేష్, బ్రాహ్మణిల ముద్దుల కుమారుడు దేవాన్ష్‌కి ఇద్దరు తాతయ్యలు (నారా చంద్రబాబు నాయుడు, నందమూరి బాలకృష్ణ) ఇష్టమేనట. అయితే… తన తండ్రి బాలయ్య చేసే సందడిని అమితంగా ఇష్టపడతాడని, తాతామనవాళ్లు ఇద్దరూ కలిస్తే ఇల్లంతా అల్లరి అల్లరే అని బ్రాహ్మణి తెలిపారు. “మా అబ్బాయితో కలసి నాన్న ఎక్కువ అల్లరి చేస్తారు. అందుకని, వాడు నాన్నకు ‘గోల తాతయ్య’ అని పేరు పెట్టేశాడు. ఓసారి విదేశాలకు వెళ్ళినప్పుడు అమ్మమ్మతో మాట్లాడతావా? అని అడిగితే ‘గోల తాతయ్యతో మాట్లాడతా’ అన్నాడు. నాన్నతో కాసేపు మాట్లాడిన తరవాత హ్యాపీగా ఫీలయ్యాడు” అని ఫాదర్స్ డే సందర్భంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో బ్రాహ్మణి పేర్కొన్నారు. తన తండ్రిది చాలా సింపుల్ మనస్తత్వమని, దేవాన్ష్ వయసున్న పిల్ల దగ్గరనుంచి పెద్దవాళ్ళ వరకూ ఎవరితోనైనా సులభంగా కలిసిపోతారని, నిజ జీవితంలో నాన్నకు నటించడం చేతకాదని తెలిపారామె.