ఒకే ఒక్కడు హీరో నేనే అంటున్నారట నందమూరి నటసింహం బాలయ్య బాబు.ఆ సినిమాలో హీరో అర్జున్ కదా అంటున్నారా? మీరు కరెక్టే. ఒక టీవీ యాంకర్ ముఖ్యమంత్రి తో పందెం కాసి ఒక్కరోజు ముఖ్యమంత్రి గిరీ వెలగబెట్టడం ఆ సినిమా కథ. ఇదిగో ఆ కాన్సెప్టునే జీవితంలో అమలు చేస్తానన్నది బాలయ్య పట్దుదల. ఏమంటే ఆయన జ్యోతిష్యుల వారు చెప్పారట. మీరు ఎప్పటికైనా ముఖ్యమంత్రి అవుతారు. ఒక్కరోజైనా ముఖ్యమంత్రి పీఠంపై కూచుంటారు అని చేయి చూసి మరీ చెప్పారట. అసలే బాలయ్యకు జ్యోతిష్యమంటే మహాపిచ్చి అని అందరికీ తెలుసు కదా.. అదే ఇప్పుడు బావ చంద్రబాబుకు మెరో తలనొప్పిగా మారిందంటున్నారు సన్నిహితులు. ఎలాగూ రేపు సిఎం అయ్యేది తమరి అల్లుడే కదా బాలయ్యగారూ అంటే ససేమిరా మా నందమూరి వంశం ప్రతిష్టకు నా జ్యోతిష్య విశ్వాసానికి సంబంధించిన సవాలు అని భీష్మిస్తున్నారట. ఈమధ్య ఏదో ఒక విధంగా ప్రజల మధ్యనో మీడియాలోనో హడావుడి చేయడం బాలయ్యకు పరిపాటిగా మారింది. రేపు ఈ రాష్ట్రాన్ని పాలించాలంటే ఆ మాత్రం హడావుడి వుండకపోతే ఎలా అన్నది ఆయన ప్రశ్న.మొన్నటికి మొన్న లేపాక్షి ఉత్సవాల పేరిట అన్నీ తానై చెలరేగిపోయారు. రాజ్యసభకు లోకేశ్‌ను పంపాలా వద్దా అనే నిర్ణయం తీసుకోవడానికి కూడా ఇదో ఆటంకమై కూచుందని మాజీ ఎంపి ఒకరు చెప్పారు. నిజంగా బాలయ్య అలా అంటున్నాడా అని అడిగితే ఆధారాలు చాలా చూపించారు. పైగా ఆయన హీరోను వారి అల్లుణ్ని కూడా అప్పుడప్పుడూ కలుస్తుంటారు. అందుకే ఈ కథనం తేలిగ్గా తీసేయడానికి లేదు. బాలయ్య సిఎం అని అభిమానులు నినాదాలు చేసినప్పుడల్లా ముసిముసి నవ్వులు నవ్వుకోవడం, ఉత్సాహంగా చేయి వూపడం ఎప్పుడూ జరుగుతూనే వుంటుంది. అయితే దీని వెనక నిజంగానే లోతైన ఆశ వుందని ఆ మాజీ ఎంపి చెప్పిన తర్వాతనే తెలిసింది. నందమూరి ఇంటికి కుమారుడిని అల్లుడిని చేస్తే అన్నీ సర్దుకుంటాయని చంద్రబాబు భావిస్తే ఇప్పుడు ఒకటికి రెండు సవాళ్లు ఎదురవడం ఆశ్చర్యమే. హరికృష్ణ ఆయన కుమారులు గతంలోనే విముఖంగా వుంటున్నారు. బాలకృష్ణ కూడా అడ్డం తిరిగితే మొదటికే మోసమని సలహాదారులు ముఖ్యమంత్రకి చెబుతున్నారట. ఇవన్నీ విన్న ఒక ఎన్ఆర్ఐ మిత్రుడు వ్యాఖ్యానించాడు. ‘మేక్ ఎ విష్’ తరహాలో బాలయ్యను ఒకరోజు సిఎం కుర్చీలో కూచోబెడితే అయిపోతుంది కదా.. అదైనా ఓకే గాని సిఎంగా నన్ను చూసుకోవడం మాత్రం తప్పనిసరి అంటారేమో బాలయ్య బాబు.. పారా హుషార్.