గౌతమి పుత్ర శాతకర్ణి తరవాత నందమూరి బాలకృష్ణ చేయబోయే సినిమా ఏమిటి? ఎవరితో? బాలయ్య ఈసారి కూడా షాకింగ్ నిర్ణయాన్నే తీసుకోబోతున్నాడా? ఆ అవకాశాలున్నాయని స్వయంగా నందమూరి కాంపౌండే చెబుతోంది. అవును.. బాలయ్య మరోసారి అభిమానుల్ని తన నిర్ణయంతో ఆశ్చర్యపరచబోతున్నాడు. దర్శకుల్ని ఎంచుకోవడంలో, కథానాయికల్ని ఎంపిక చేసుకోవడంలో ముందు నుంచీ భిన్నంగా ప్రయాణం సాగిస్తున్నాడు బాలయ్య. అదే స్టైల్ ఈసారీ రిపీట్ చేయబోతున్నట్టు టాక్. వెటరన్ దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి బాలయ్యకు ఓ కథ వినిపించార్ట. అది బాలయ్యకు బాగా నచ్చిందని, ఓకే అనాలా, వద్దా? అనే విషయంలో బాలయ్య తర్జన భర్జనలు పడుతున్నాడని తెలుస్తోంది. ఒక వేళ బాలయ్య 101వ సినిమా కృష్ణారెడ్డితోనే అన్నా.. ఆశ్చర్యపోనవసరం లేదని ఇండ్రస్ట్రీ వర్గాలు గుసగుసలాడుకొంటున్నాయి.
బాలయ్య, కృష్ణారెడ్డి కాంబోలో వచ్చిన టాప్ హీరో.. ఫ్లాప్ అయ్యింది. దానికి తోడు చాలాకాలం నుంచి కష్ణారెడ్డి సినిమాలకు దూరంగా ఉంటున్నారు. అడపా దడపా ప్రయత్నాలు చేసినా సఫలం అవ్వడం లేదు. పైగా బాలయ్య ఫుల్ స్వింగ్లో ఉన్నాడు. సింహా, లెజెండ్ సినిమాలు సూపర్ హిట్ కొట్టాయి. గౌతమి పుత్రపై కూడా భారీ అంచనాలున్నాయి. కృష్ణవంశీ, పూరి జగన్నాథ్ లాంటి వాళ్లు బాలయ్యతో సినిమా చేయడానికి తహతహలాడుతున్నారు. ఈ దశలో కష్ణారెడ్డికి ఛాన్స్ ఇవ్వడం ఆశ్చర్యపరిచే విషయమే. కాకపోతే.. బాలయ్య రూటే సెపరేటు. లెజెండ్ తరవాత.. సత్యదేవకి ఆఫర్ ఇచ్చి అందరి అంచనాల్ని తలకిందులు చేశాడు. బాలయ్య మరోసారి అలాంటి ఎత్తుగడే వేయబోతున్నాడనిపిస్తోంది. కృష్ణారెడ్డిపై గౌరవంతో బాలయ్య కథ విన్నాడని, నో చెప్పే ఉద్దేశంతో విన్నా… కథ బాగా నచ్చేసిందని, కేవలం కథపై నమ్మకంతో బాలయ్య ఈసినిమాని ఒప్పుకొన్నా ఒప్పుకోవచ్చని బాలయ్య సన్నిహితులు చెబుతున్నారు. చూద్దాం… ఏం జరగబోతోందో??