ఎన్టీఆర్ – శ్రీదేవిలది సూపర్ హిట్ కాంబినేషన్. ఈ కలయికలో ఎన్నో సూపర్ హిట్స్ ఉన్నాయి. మ్యూజికల్ హిట్స్ ఉన్నాయి. వాటిలో `వేటగాడు` ప్రత్యేకం. కమర్సియల్ సినిమాకి అర్థం చెప్పిన సినిమా అది.
‘ఆకు చాటు పిందె తడిసె’ పాట గురించి ఇప్పటికీ చెప్పుకుంటూనే ఉంటారు. కోటి రూపాయల పాటగా ప్రసిద్దికెక్కిన ఆ గీతం… అప్పట్లో మాస్ ని ఊపేసింది. ఇప్పుడు ఈ పాటని ‘ఎన్టీఆర్’ బయోపిక్ లో వాడుకుంటున్నారు. ‘ఎన్టీఆర్’ బయోపిక్‌లో శ్రీదేవిగా రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ పాట బాలయ్య – రకుల్‌లపై తెరకెక్కించనున్నారు. ఈ పాట కోసం హైదరాబాద్‌లో ప్రత్యేకమైన సెట్‌ని తీర్చిదిద్దుతున్నారు. ఈ వారంలోనే షూటింగ్ కూడా పూర్తి చేస్తారు. ‘ఆకు చాటు పిందె తడిసె’ బిట్ రూపంలో వాడతారా? లేదంటే పూర్తి పాటని చూపిస్తారా? ఎన్టీఆర్ – శ్రీదేవిలపై వచ్చిన సూపర్ హిట్ గీతాలన్నీ మెడ్లీగా చేస్తారా? అనేది తెలియాల్సివుంది. ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఎన్ బీ కె ఫిల్మ్స్ రూపొందిస్తున్న ఈ చిత్రం ఈ సంక్రాంతికి విడుదల కానుంది.