మున్సిపల్ ఎన్నికల సందర్భంగా బాలకృష్ణ ఎన్నికల ప్రచారంలో జోరుగా పాల్గొంటున్నారు. ప్రచారంలో అధికార వైఎస్ఆర్సిపి పార్టీ మీద వరసబెట్టి విమర్శలు చేస్తున్నారు. తాజాగా విజయసాయి రెడ్డిని ఉద్దేశించి బాలయ్య చేసిన విమర్శలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి . వివరాల్లోకి వెళితే…
మొన్నామధ్య విశాఖపట్నంలో విజయసాయిరెడ్డి విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యోగులతో సమావేశం అయిన సందర్భంగా ఉపన్యాసం ఇస్తూ ” విశాఖ ఉక్కు కర్మాగారం” అనడానికి బదులు గా “విశాఖ ఉక్కు కారాగారం”అంటూ స్టీల్ ప్లాంట్ ను సంబోధించారు. ఒకటికి రెండు సార్లు అదేవిధంగా సంబోధించడం తో ఉద్యోగులు గోల చేయగా, అదేంటని విజయసాయిరెడ్డి కనుక్కుంటే వారు, “కారాగారం కాదు కర్మాగారం” అని ఆయనను సరి చేశారు. తాజగా ఎన్నికల ప్రచారంలో భాగంగా బాలకృష్ణ ఇదే అంశాన్ని లేవనెత్తారు. కర్మాగారానికి కారాగారానికి తేడా తెలియని నాయకులు ఉన్నారంటూ విజయసాయిరెడ్డిని ఎద్దేవా చేశారు. ” అయినా మనకు అలవాటే గా, కారాగారానికి చీటికిమాటికి వెళ్ళడమూ, రావడమూ ” అంటూ చేతులు ఊపుతూ ఒక రేంజ్ లో విజయసాయి రెడ్డి పై ఫైర్ అయ్యారు బాలకృష్ణ. దీనిపై అక్కడి ప్రజల నుండి పెద్ద ఎత్తున స్పందన లభించింది.
బాలకృష్ణ విజయసాయి రెడ్డి పై చేసిన వ్యాఖ్యలు, అభినయం క్షణాల్లో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో వైఎస్ఆర్సిపి అభిమానులు దాన్ని కౌంటర్ చేయలేక సతమతమవుతున్నారు. అయితే కొందరు మాత్రం బాలకృష్ణ విషయంలో గతంలో జరిగిన కాల్పుల సంఘటన ని మళ్లీ ప్రస్తావిస్తూ, అప్పట్లో రాజశేఖరరెడ్డి సాయం చేయకపోయి ఉంటే బాలకృష్ణ కూడా అదే కారాగారంలోనే ఉండాల్సి వచ్చేది అంటూ విమర్శలు చేస్తున్నారు.
ఏది ఏమైనా సాధారణ ఎన్నికలకు దీటుగా మున్సిపల్ ఎన్నికల ప్రచారం జరుగుతూ ఉండడం తో విమర్శలు ప్రతి విమర్శలతో రాజకీయం వేడెక్కుతోంది.