‘కథానాయకుడు’ విడుదలకు సిద్ధమైంది. ఈనెల 9న ఈ చిత్రం విడుదల కానుంది. ఈ సినిమా ప్రమోషన్లలో బాలయ్య బిజీ బిజీగా ఉన్నాడు. ఆ వెంటనే పండగ హడావుడి మొదలైపోతుంది. అయితే… బాలయ్యకు పండగ సెలవలు లేవు. వెంటనే `మహా నాయకుడు` షూటింగ్లో పాల్గొనాల్సివస్తుంది. `మహా నాయకుడు`కి సంబంధించి మరో పది రోజుల షూటింగ్ బాకీ ఉంది. పండగ తరవాత షూటింగ్ మొదలెట్టాలని బాలయ్య భావించారు. అయితే.. 12 నుంచి చివరి షెడ్యూల్ పూర్తి చేయాలన్న నిర్ణయానికి వచ్చారు. 12న షూటింగ్ మొదలెట్టి, పెద్ద పండగ రోజున గ్యాప్ ఇచ్చి… ఆ తరవాత మళ్లీ షూటింగ్ కొనసాగిస్తారు. మొత్తానికి ఈనెల 23 లేదా 24 తేదీలోగా గుమ్మడి కాయ కొట్టేయాలని భావిస్తున్నారు. ఫిబ్రవరి 6నే రెండో భాగం విడుదల కావాలి. పండగ తరవాత మొదలెడితే… విడుదలకు ముందు ఇబ్బంది పడే అవకాశం ఉంది. ఆ పరిస్థితి రాకూడదన్న ఉద్దేశంతోనే బాలయ్య ఈ నిర్ణయం తీసుకున్నాడని సమాచారం.