ఎన్టీఆర్ బయోపిక్ కంటే ముందే బాలయ్య మరో సినిమా చేస్తారని ప్రచారం జోరుగా సాగుతోంది. నిజానికి సి.కల్యాణ్‌కి బాలయ్య మరో సినిమా చేసి పెడతానని మాట ఇచ్చాడు. అందుకే కల్యాణ్ ఎలాగైనా బాలయ్యతో సినిమా చేయాలని జోరుగా ప్రయత్నాలు చేస్తున్నాడు. ఈ దశలో వినాయక్, సంపత్ నంది, అనిల్ రావిపూడి లాంటి పేర్లు వినిపించాయి. బాలయ్య కథలు వినేశారని, ఆయన నిర్ణయం ప్రకటించాల్సివుందని చెప్పుకున్నారు. అయితే వాస్తవానికి బాలయ్య ఎలాంటి కథా వినలేదు. ఆయన పూర్తిగా ఎన్టీఆర్ పనుల్లోనే నిమగ్నమై ఉన్నారు. వినాయక్ దగ్గర బాలయ్యకు తగిన కథ ఉన్నా… ఇప్పుడు సినిమా చేయడానికి వినాయక్ రెడీగా లేడని తెలస్తోంది. తనకు మూడు నెలల సమయం కావాలని అడిగాడట. అనిల్ రావిపూడి, సంపత్ నంది దగ్గర కథలున్నమాట వాస్తవమే. కానీ.. బాలయ్య ఇప్పటి వరకూ ఎవరి కథా వినలేదు. ముందు ఎన్టీఆర్ సినిమాకి సంబంధించిన షెడ్యూల్స్ వేసిన తరవాత.. ఎక్కడైనా భారీ గ్యాప్ దొరుకుతోంది అనుకుంటే… అప్పుడు మరో సినిమా చేయాలన్న ఆలోచన కు వచ్చాడట. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో భారీ గ్యాప్‌లు దొరికే అవకాశం లేదు. ”బాలయ్య సినిమాపై వస్తున్న వార్తల్లో నిజం లేదు. ఆయన వేరే ఏ కథా వినలేదు” అని బాలయ్య సన్నిహితులు క్లారిటీ ఇస్తున్నారు. సో.. సంపత్ నంది లాంటి వాళ్లు ఇంకొన్ని రోజులు ఎదురుచూడక తప్పదు.