తెలుగు సినీ పరిశ్రమలో బాలకృష్ణకున్న స్థానం గురించి ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. చెప్పుకొంటే అది ముంజేతి కంకణాన్ని అద్దంలో చూసుకొన్నట్లే అవుతుంది. ఆయన హిందూపురం నుండి అసెంబ్లీకి పోటీ చేసి ప్రత్యక్ష రాజకీయాలలోకి ప్రవేశించినప్పుడు, ఒకవైపు సినిమాలు చేసుకొంటూ ప్రజాసేవ ఏమి చేస్తారు? తన నియోజక వర్గాన్ని ఏమి అభివృద్ధి చేస్తారు? అని చాలామంది పెదవి విరిచారు. కానీ బాలకృష్ణ వాళ్ళందరికీ తనదయిన శైలిలో చేతలతోనే జవాబిచ్చారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి అందిన జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి తాజా నివేదికలలో అనంతపురం జిల్లాలో అందరికంటే బాలయ్య బాబే తన నియోజక వర్గం అభివృద్ధి పనులపై ఎక్కువ శ్రద్ధ పెడుతున్నట్లు తెలిసింది. అనంతపురం జిల్లాలో ఉన్న 12మంది ఎమ్మెల్యేలలో కూడా అందరి కంటే ఆయనే చాలా మెరుగ్గా ప్రజలకి సేవలందిస్తున్నారని, ఆయనే తన నియోజక వర్గ ప్రజలకు ఎక్కువ అందుబాటులో ఉంటున్నారని, వారి సమస్యల పరిష్కారానికి గట్టిగా కృషి చేస్తున్నారని నివేదికలలో పేర్కొనబడింది. జిల్లా స్థాయిలో ఆయనకే ఫస్ట్ ర్యాంక్ వచ్చినట్లు సమాచారం. ఆయన తరువాత స్థానంలో మంత్రి పరిటాల సునీత ఉన్నట్లు సమాచారం. ఒకవైపు సినిమాలు చేసుకొంటూనే, పూర్తి సమయం రాజకీయాలలో పనిచేసే వారికంటే మిన్నగా బాలయ్య బాబు ప్రజలకు సేవలందించడం హర్షణీయం.