బాలినేనికి తత్వం బోధపడింది. టిక్కెట్ ఇస్తే పోటీ చేస్తా లేకపోతే లేదన్నట్లుగా డిసైడయిపోయారు. తన మాట ఎవరూ వినకూడదని గట్టి పట్టుదలగా ఉన్నారని ఆయనకు తెలిసివచ్చింది. మాగుంటకు లోక్‌సభ టిక్కెట్ ఇస్తే లోక్ సభ పరిధిలోని అన్ని నియోజకవర్గాల్లో వైసీపీ అభ్యర్థులకు బలం వస్తుందని తాను ప్రయత్నించానని.. ఎవరికీ పట్టకపోతే తనకెందుకని ఆయన చెప్పుకొస్తున్నారు.
మాగుంట శ్రీనివాసుల రెడ్డి కోసం ప్రయత్నం చేశా.. మిగతా నియోజకవర్గాల ఇంఛార్జీలు, ఎమ్మెల్యేలు పట్టీపట్టనట్లున్నారు.. అధిష్టానం దృష్టిలో నేను ఒక్కడినే ప్రశ్నించినట్లవుతోంది.. మిగతావాళ్లకు పట్టనప్పుడు నాకు మాత్రం ఎందుకు..? అని ప్రశ్నించారు. తాను అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉంటానని స్పష్టం చేశారు.ఏ ఎంపీ అభ్యర్ధి వచ్చినా నాకు ఏ అభ్యంతరం లేదు.. నా పని నేను చేసుకుంటానని తెలిపారు బాలినేని శ్రీనివాస్‌రెడ్డి. చివరికి చెవిరెడ్డికి ఇచ్చినా ఆయనేమీ చేయలేని పరిస్థితి.
ఇప్పటికే చెవిరెడ్డికి పెత్తనం ఇస్తూ నిర్ణయంతీసుకున్నారు. బాలినేని శ్రీనివాసరెడ్డి సీఎం జగన్ కు దగ్గర బంధువు. గతంలో ఆయన జనసేన పార్టీలో చేరుతారన్న ప్రచారం జరిగింది. తర్వాత పలు సందర్భాల్లో వైసీపీ అధినేతపై అసంతృప్తి వ్యక్తం చేశారు. అయితే ఆయన పార్టీ మారే అవకాశం ఉండదని.. వైసీపీ తరపునే పోటీ చేస్తారని అంటున్నారు. మరో వైపు మాగుంట శ్రీనివాసులరెడ్డి .. తన కుమారుడితో కలిసి టీడీపీలో చేరేందుకు సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తోంది. బాలినేని టీడీపీలో చేరినా ఆయనకు సీటు దొరకడం కష్టమే.