జనసేన పార్టీ ఆవిర్భావ సభ జయకేతనంలో బాలినేని శ్రీనివాసరెడ్డి భావోద్వేగానికి గురయ్యారు. ఆయన వైసీపీలో ఎదుర్కొన్న పరిస్థితులు ..ఇప్పుడు జనసేనలో లభిస్తున్న గౌరవం ఆయనను చాలా విషయాలు బయట పెట్టేలా ప్రోత్సహిచింది. ముఖ్యంగా ఆయన జగన్మోహన్ రెడ్డి పై చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టించనున్నాయి. తన ఆస్తులతో పాటు తన వియ్యంకుడి ఆస్తుల్ని జగన్ కాజేశారని బాలినేని శ్రీనివాసరెడ్డి ఆరోపించారు. తాను చెప్పిన ఈ విషయంపై చాలా మంది కౌంటర్లు ఇస్తారని .. దేనికైనా తాను సిద్దమని బాలినేని స్పష్టం చేశారు.
రాజకీయాల్లో తనకు జరిగిన అన్యాయం అంతా ఇంతా కాదు. తాతల నుంచి వచ్చిన ఆస్తులన్నింటినీ పోగొట్టుకున్నానన్నారు. ఎమ్మెల్యేలు, ప్రభుత్వం, చంద్రబాబు విచారణ చేయించాలని కోరారు. మొత్తం తాను చెప్పిన విషయాల్లో నిజాలు బయటకు వస్తాయన్నారు. అందర్నీ అడుగుతున్నాన్నారు. వైసీపీలో ఉన్నప్పుడు తాము ఎదుర్కొన్న పరిస్థితులతో తమ కుటుంబం ఎంత బాధపడిందో తమకు తెలుసన్నారు. తాను వైసీపీలో ఉన్నప్పుడు కూడా పవన్ .. వైసీపీని విమర్శిస్తూ కూడా.. పవన్ తనను మంచోడన్నారని ఆయన భావోద్వేగానికి గురై కాసేపు మాట్లాడలేకపోయారు.
బాలినేని ప్రసంగం ఎప్పటిలా లేదు. ఆయన తన ఆవేదన అంతా చెప్పుకున్న విధంగా మాట్లాడారు. అప్పుడప్పుడు మాట్లాడలేకపోయారు. బాలినేని జగన్మోహన్ రెడ్డి సమీప బంధువు. ఆయన ఆస్తులను కూడా జగన్ కాజేశారనే విషయం చిన్న మ్యాటర్ కాదు. రాజకీయంగా కలకలం రేపుతుంది. ఈ అంశంపై వైసీపీ నేతలు చేసే విమర్శలకు ప్రతిగా బాలినేని సాక్ష్యాలు బయట పెట్టే అవకాశం ఉంది.