జగన్ రెడ్డి బంధువు బాలినేని శ్రీనివాసరెడ్డికి రాజకీయంగా ఊపిరి ఆడటం లేదు. వేరే పార్టీల్లోకి పోలేడు.. సొంత పార్టీలో ఆదరణ ఉండదు. అందుకే భిన్నమైన వ్యూహాలతో రాజకీయం చేస్తున్నారు. జగన్ ను బతిమాలుకునో… బ్లాక్ మెయిల్ చేసో దగ్గరవ్వాలనుకుంటున్నారు.
ఎన్నికల ఫలితాల తర్వాత ఆయన ఒంగోలులో ఉన్నది తక్కువే. అప్పుడప్పుడూ వచ్చి.. తనకు జనసేనలో ఆఫర్ ఉందని సంకేతాలు ఇచ్చి వెళ్తూంటారు. తన అనుచరుల్ని టీడీపీలోకి పంపుతున్నారు. తనకు ప్రాధాన్యత లేకపోతే ఎవరూ పార్టీలో ఉండరని బహిరంగంగానే చెబుతున్నారు. కానీ జగన్ వైపు నుంచి స్పందన రావడం లేదు. కనీసం బాలినేనిని సమావేశాలకు కూడా పిలవడం లేదు. ఇక ఈ పద్దతి వర్కవుట్ కాదని.. బతిమాలుకునే రాజకీయం చేస్తున్నారు.
తన అనుచరులు, కార్పొరేటర్లను తాడేపల్లికి పంపారు బాలినేని. వారి చేత.. బాలినేని లేకపోతే పార్టీ లేదని ఆయనను పిలిచించి మాట్లాడి.. మళ్లీ యాక్టివ్ అయ్యేలా చూడాలని జగన్ కు చెప్పించారు. వారి మాటలు విన్న జగన్ రెడ్డి కూడా బాలినేని నిస్సహాయతపై జాలి పడి ఉంటారు. అయితే జగన్ కు అలాంటి ఎమోషన్స్ ఉండవు కాబట్టి… బాలినేని కష్టాల్లో ఉంటే చూసి ఆనందిస్తూ ఉంటారని అనుకోవచ్చు. బాలినేని పార్టీ మారితో రాజకీయ భవిష్యత్ ఉండదు.. వైసీపీలో ఉన్నా.. అదే పరిస్థితి. అందుకే ఆయన ఒత్తిడికి గురవుతున్నారు. రేపోమాపో జగన్ దగ్గరకు పోయి కాళ్లు కాదు చేతులు అని.. బతిమాలుకున్నా ఆశ్చర్యం లేదని ఒంగోలులో ప్రచారం జరుగుతోంది.