వైఎస్ కుటుంబంలో ఆస్తుల గొడవపై జనసేన పార్టీ నేత, వైఎస్ కుటుంబంలోని వ్యక్తి అయిన బాలినేని శ్రీనివాసరెడ్డి స్పందించారు. ఆడబిడ్డ ఏడుపు అరిష్టమని జగన్ రెడ్డి తెలుసుకోవాలన్నారు.ఈ వివాదాన్ని విజయమ్మే పరిష్కరించాలని సలహా ఇచ్చారు.ఇప్పటికీ రోడ్డున పడింది చాలని నాలుగు గోడల మధ్య పరిష్కరించుకుని వైఎస్ పేరుకు ఉన్న గౌరవాన్ని కాస్త నిలబెట్టుకోవాలని ఆయన సలహా ఇచ్చారు. అదే సమయంలో ఆయన ఆస్తుల విషయంలో జగన్ తీరుపై తీవ్ర విమర్శలు చేశారు.
రాజకీయాల కారణంగా తాను అప్పుల పాలై తన తండ్రి ఇచ్చిన ఆస్తులతోపాటు తన కోడలికి వచ్చిన ఆస్తుల్ని కూడా అమ్ముకున్నానని బాలినేని చెప్పుకొచ్చారు. వైసీపీలో చేరి తాను సంపాదించుకున్నదేమీ లేకపోగా తీవ్రంగా నష్టపోయానన్నారు. అలాంటి జగన్ ఇప్పుడు ఎందుకు ఆస్తుల గురించి మాట్లాడుతున్నారని ఆయన ప్రశ్నించారు. అంటే బాలినేని ఉద్దేశం ప్రకారం తాను కష్టాల్లో ఉన్నప్పుడు తన సమస్యలన్నింటినీ జగన్ కు చెబితే ఆస్తుల్ని లైట్ తీసుకోమని సలహా ఇచ్చి ఉంటారు. ఆ కోపం ఇప్పుడు బాలినేని బయట పెట్టుకుంటున్నారని అనుకోవచ్చు.
నిన్నటిదాకా షర్మిలను అందరితోనూ తిట్టించిన వైసీపీ నేతలు హఠాత్తుగా ఈ అంశంపై ఇక ఎవరూ మాట్లాడవద్దని ఆదేశాలు జారీ చేశారు.కానీ వారు ప్రారంభించినది .. వారు ఆపేయమంటే ఆగడం కష్టం. అందుకే ఇప్పుడు బాలినేని తెరపైకి వచ్చారు. వైసీపీ నేతలు మాట్లాడకపోవచ్చుకానీ ఇతరులు మాత్రం ఖచ్చితంగా మాట్లాడతారని అనుకోవచ్చు.