వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డిని సీఎం జగన్ మరోసారి తాడేపల్లికి ఆహ్వానించారు. మధ్యాహ్నం 3 గంటలకు తాడేపల్లికి రావాల్సిందిగా బాలినేనికి సీఎం కార్యాలయం సమాచారం పంపింది. దీంతో బాలినేని శ్రీనివాసరెడ్డికి ప్రకాశం జిల్లా విషయంలో పూర్తి స్థాయి బాధ్యతలివ్వాలని నిర్ణయించుకున్నట్లుగా ఆయన వర్గం భావిస్తోంది. గతంలో బాలినేని అసంతృప్తికి గురయినా పట్టించుకోలేదు.
ఇప్పుడు సర్వే రిపోర్టులు ఇతర అంశాలను పరిగణనలోకి తీసుకుని ఉమ్మడి ప్రకాశం జిల్లాలో బాలినేనికే బాధ్యతలివ్వాలని జగన్ అనుకుంటన్నట్లుగా చెబుతున్నారు. ప్రకాశం జిల్లాలో వైసీపీ మరో సీనియర్ నేత, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డితో బాలినేని శ్రీనివాసరెడ్డికి విబేధాలున్నాయి. తనకు ప్రోటోకాల్ కూడా జిల్లాల్లో సరిగ్గా అందకుండా చేస్తున్నారన్న ఉద్దేశంతో బాలినేని రీజనల్ కో ఆర్డినేటర్ పదవీకి రాజీనామా చేశారు. ఆ బాధ్యతలను విజయసాయిరెడ్డికి ఇచ్చినట్లుగా ప్రచారం జరుగింది. కానీ విజయసాయిరెడ్డి ఆసక్తి చూపలేదు.
రీజినల్ కోఆర్డినేటర్ పదవికి రాజీనామా చేసిన తర్వాత వైసీపీ జెండాలు లేకుండానే ఆయన కార్యక్రమాలు చేపట్టడం చర్చనీయాంశమయింది. ఆయన టీడీపీ లేదా జనసేనలో చేరడానికి నిర్ణయించుకున్నట్లుగా చెప్పుకున్నారు అయితే జగన్ మరోసారి బుజ్జగించాలని.. ప్రకాశం జిల్లాలో వైవీ సుబ్బారెడ్డి పాత్ర లేకుండా మొత్తం బాలినేనికే ఇస్తానని… పక్క చూపులు చూడవద్దని జగన్ కోరే అవకాశాలున్నాయన్న ప్రచారం జరుగుతోంది.