చిత్తూరు జిల్లా వైసీపీని కనుసైగలతో నడిపించిన వైసీపీ నెంబర్ టూ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇప్పుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి లోకువయ్యారు. చెవిరెడ్డి వద్దన్నారని చెప్పి మిథున్ రెడ్డిని ప్రకాశం జిల్లా సమన్వయకర్త పదవి నుంచి జగన్ రెడ్డి తొలగించారట. ఎందుకు ఆ మిథున్ రెడ్డి కనిపించడం లేదా అని అనుకుంటున్న వైసీపీ క్యాడర్ కు.. బాలినేని శ్రీనివాసరెడ్డి ఈ మేరకు స్పష్టత ఇచ్చారు. మిథున్ రెడ్డి ప్రకాశం జిల్లా సమన్వయకర్తగా నియమించిన తర్వాత చెవిరెడ్డి జోక్యం చేసుకుని ఆయన వద్దని చెప్పడంతో జగన్ తీసేశారని బాలినేని బయట పెట్టారు.
చెవిరెడ్డికి ఉన్నంత విలువ తమకు లేదని పెద్దిరెడ్డి ఆయన కొడుకు ఫీలయ్యారో లేకపోతే పదేళ్ల కాలంలో బోలెడంత సంపాదించుకునే అవకాశం ఇచ్చారు కాబట్టి ఇలాంటి అవమానాలు భరించడం అలవాటేనని అనుకున్నారో కానీ.. వారు మాత్రం సైలెంటుగా ఉంటున్నారు. నగరిలో పెద్దిరెడ్డి వర్గాన్ని సస్పెండ్ చేయించినా వారు మాట్లాడలేదు. అలాగే చిత్తూరు జిల్లాలో పెద్దిరెడ్డి వర్గం అనుకున్న వారందర్నీ పక్కన పెట్టేస్తున్నారు. అయినా వారేమీ మాట్లాడలేకపోతున్నారు.
అధికారంలో ఉన్నప్పుడు చేసిన నిర్వాకాలతో పెద్దిరెడ్డి ప్రజలకు దూరమయ్యారు. సొంత నియోజకవర్గంలో బొటాబొటి మెజార్టీతో గెలిచారు. ఇప్పుడు వైసీపీ కూడా ఆయనను దూరం పెడుతోంది. చిత్తూరు జిల్లాలో ఆయనతో పాటు ఆయన సోదరుడు మాత్రమే గెలిచి మిగతా అందరూ ఓడిపోవడం వెనుక మ్యాజిక్ ఉందని జగన్ అనుమానిస్తున్నారు. అందుకే ఆయనను పక్కన పెడుతున్నారని అంటున్నారు. పరిస్థితి చూస్తూంటే వైసీపీలో పెద్దిరెడ్డికి లైఫ్ లేదన్న వాదన వినిపిస్తోంది.