ఎన్నో రోజులుగా ఉన్న అసంతృప్తి… జగన్ ఎన్ని రాయబారాలు పంపినా బాలినేని ఆగలేదు. ముక్కుసూటిగా మాట్లాడుతారన్న పేరున్న మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి పార్టీకి గుడ్ బై చెప్పారు. ఎన్నికలకు ముందు నుండే ఉన్న అసంతృప్తి ఆ తర్వాత కూడా కొనసాగింది.
జగన్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన నాటి నుండి ఆయన వెంటే ఉన్న అతికొద్ది మందిలో బాలినేని కూడా ఒకరు. వైఎస్ ఫ్యామిలీతో బంధుత్వం కూడా ఉండటం, మొదటి నుండి వైఎస్ అనుకూల వర్గంగా ఉన్న బాలినేని… జగన్ తో నడిచారు.
అయితే, మంత్రివర్గ పునర్వవ్యవస్థీకరణ సమయంలో బాలినేనిని మంత్రివర్గం నుండి తీసేయటం, ఆయనతో గిట్టని ఆదిమూలపు సురేష్ ను మాత్రం కొనసాగించటంతో అసంతృప్తి పెరిగింది. దానికి తోడు ఒంగోలు, ప్రకాశం జిల్లా రాజకీయాల్లో వైవీ సుబ్బారెడ్డి జోక్యం చేసుకోవటం… తనను కాదని, తాను వద్దన్న పోలీసు అధికారులను బదిలీ చేయటంతో బాలినేని తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. ఇదే విషయాన్ని స్వయంగా జగన్ ను కలిసి కూడా చెప్పినా ఫలితం లేదని ఆయన అనుచరులు అప్పట్లో బహిరంగంగానే ప్రకటించారు.
ఇక ఎన్నికలకు ముందు ఎంపీ టికెట్ విషయంలో ఆయన చివరి వరకు ఎంపీ మాగుంటకు టికెట్ కావాలని పట్టుబట్టారు. కానీ జగన్ వినలేదు. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఒంగోలు ఎమ్మెల్యేగా పోటీ చేసినా ఓడిపోయారు. ఆ తర్వాత పార్టీకి అంటీముట్టనట్లుగానే ఉంటూ వచ్చారు. ఒంగోలు నుండి ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన బాలినేని… వైసీపీకి రాజీనామా చేసిన లేఖను జగన్ కు పంపారు.