జగన్ బంధువనే పేరే కానీ… ఆ ఆదరణ మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డికి ఎక్కడా లభించడం లేదు. రోజుకో వివాదం ఆయన చుట్టూ అలుము కుంటోంది. కొద్ది రోజుల కిందట జనసేన మహిళా నేతకు ఫోన్ చేసి అసభ్యంగా మాట్లాడారన్న ఆరోపణలు వచ్చాయి. తర్వాత ఓ మహిళ బాలినేనిని ప్రశ్నించినందుకు వేధిస్తున్నారని మీడియాకు ఎక్కి రచ్చ చేస్తున్నారు. చెన్నైలో పెద్ద ఎత్తున హవాలా మనీ దొరకినా అందరూ ఆయన వైపే అనుమానంగా చూస్తున్నారు. దీంతో బాలినేని ఒక్క సారిగా బ్లాస్టయ్యారు.
సొంత పార్టీకి చెందిన పెద్ద నేతలే కుట్రలు చేస్తున్నారని వారికి టీడీపీ నేతలు సహకరిస్తున్నారని ్నుమానం వ్యక్తంచేశారు. ఎవరు చేస్తున్నారో కూడా తనకు తెలుసన్నారు. టీడీపీతో వాళ్లు టచ్లో ఉన్నారని.. హవాలా మంత్రి అని వాళ్లే అనిపిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను తప్పు చేసినట్లు నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని ఛాలెంజ్ చేశారు. ఈ కుట్రలన్నింటిలోనూ తమ పార్టీకి చెందిన వారు కూడా ఉన్నారని..తనపై జరుగుతున్న కుట్రల విషయమై జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశానని బాలినేని చెబుతున్నారు.
మంత్రి పదవి పోయిన తర్వాత బాలినేని వివాదాల్లో కూరుకుపోతూండటంతో తన వెనుక కుట్రలు జరుగుతున్నాయని ఆరోపిస్తున్నారు. ప్రకాశం జిల్లా రాజకీయాల్లో వైవీ సుబ్బారెడ్డికి.. బాలినేనికి పొసగదు. ఈ కారణంగా ఆయనే చేపిస్తున్నారనేది బాలినేని ఆరోపణ. నిజానికి వారిద్దరూ బంధువులే.