నిజామాబాద్ ఎంపి,టిఆర్ఎస్ అధినేత కుమార్తె కవిత వచ్చే ఎన్నికల్లో ఎంఎల్ఎగా పోటీ చేసి రాష్ట్రానికి రావాలనుకుంటున్నారని టైమ్స్ ఆఫ్ ఇండియా ఒక వార్త ప్రచురించింది. మోడీ ప్రభుత్వంలో టిఆర్ఎస్ చేరలేదు గనక ఇక ఢిల్లీలో పెద్దగా చేసేదేమీ వుండదని కవిత భావిస్తున్నట్టు ఆ వార్త సారాంశం. నిజంగానే మంత్రివర్గం విషయంలో కవిత కొంత ఆశాభావం కనబరచేట్టు మాట్లాడుతూ వచ్చారు. చేరాలో వద్దో ముఖ్యమంత్రి కెసిఆర్ నిర్ణయం తీసుకుంటారని జవాబిస్తుండేవారు తప్ప పూర్తిగా తోసిపుచ్చేవారు కాదు. అయితే మొన్నటి విస్తరణ తర్వాత మరో చివరి దఫా వుందని అంటున్నారు గాని టిఆర్ఎస్ చేరే ధోరణి అగుపించడం లేదు. ఈ నేపథ్యంలోనే కవిత శాసనసభకు పోటీ చేసి రాష్ట్ర రాజకీయాల్లోకి వచ్చేస్తారని కొన్ని కథనాలు నడుస్తున్నాయి. అయితే ఇది నిజం కాదని తెలంగాణ ప్రథమ కుటుంబానికి బాగా సన్నిహితుడైన ఒక నేత చెప్పారు. ఇంకా చెప్పాలంటే పెద్దపల్లి యువ ఎంపి సుమన్ రాష్ట్రానికి వచ్చే అవకాశం వుందట. ఈ మేరకు కెసిఆర్ తనకు సూచన చేసినట్టు సమాచారం. దళిత విద్యార్థి నేతగా చురుగ్గా వుంటూ కోదండరాంపైన కాంగ్రెస్‌పైన దాడి చేయడానికి ప్రధానంగా వినియోగపడుతున్న సుమన్ వివేక్‌పై గెలిచి ఎంపి కావడం అప్పట్లో పెద్ద సంచలనం.ఇప్పుడు వివేక్ కూడా టిఆర్ఎస్కు మరోసారి దగ్గరైన పరిస్థితులలో ఆయన స్థానం ఆయనకు ఇచ్చేందుకోసం ఈ ప్రతిపాదన చేస్తున్నారా అన్నది ఆలోచించాల్సిన అంశం. మరి కవితకు సంబంధించిన కథనాలు ప్రచారంలో పెట్టిందెవరంటే ఈ మధ్య జగిత్యాలలో ఆమె బాగా పర్యటనలు చేయడంతో కాంగ్రెస్ వాదులు చెప్పి వుంటారని టిఆర్ఎస్ నేతలు అంటున్నారు.