రెండ్రోజులుగా వినిపిస్తున్న వార్తా కథనాల ప్రకారమే… కేసీఆర్ పై పోటీ చేసేందుకు గద్దర్ దాదాపుగా సిద్ధపడ్డారు! కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీని ఆయన ఢిల్లీలో కలుసుకోవడం కొంత ప్రాధాన్యతను సంతరించుకుంది. రాజకీయ పార్టీతోపాటు ప్రజలూ తనని కోరుకుంటే… గజ్వేల్ నియోజక వర్గం నుంచి కేసీఆర్ మీద పోటీ చేసేందుకు సిద్ధం అని ఆయన ప్రకటించారు. సైద్ధాంతికంగా ఆయన ఏపార్టీలోనూ చేరే అవకాశం లేదు కాబట్టి… మహా కూటమి ఆయనకి మద్దతు ఇచ్చే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. నిజానికి, కేసీఆర్ పై గద్దర్ పోటీకి మద్దతు వెనక మహా కూటమి వ్యూహం ఉందనీ చెప్పుకోవచ్చు.
కేసీఆర్ మీద కూటమి నుంచి ఏదో ఒక పార్టీకి చెందిన ఎవరో ఒకర్ని నిలబెట్టినా పెద్దగా ప్రయోజనం ఉండదు! ఇతర నేతల్ని విమర్శించినట్టుగానే… తన ప్రత్యర్థిపై కూడా కేసీఆర్ మాటల తూటాలు అవలీలగా పేల్చేస్తారు. అదే, గద్దర్ పోటీకి దిగారనుకోండి… కేసీఆర్ అంత ఈజీగా విమర్శలు చేసే ఆస్కారం తక్కువ! పైగా, గద్దర్ కు మద్దతు ఇవ్వడం ద్వారా మహాకూటమికి జరిగే మరో మేలు కూడా ఉంది. ఒక సాధారణ రాజకీయ పార్టీ నాయకుడి మాదిరిగా గద్దర్ ఎన్నికల్ని ఎదుర్కొంటారనీ, గెలుపు వ్యూహాలు తిరగరాసేస్తారని ఎవ్వరూ అనుకోరు. ఆయనకు ఆయుధమైన పాట ద్వారా తెరాస పాలనపై ప్రభావవంతమైన విమర్శలు చేసే ఆస్కారం ఉంది. కేసీఆర్ కి వ్యతిరేకంగా గద్దర్ ఆటాపాటా గజ్వేల్ నియోజక వర్గంలో సాగినా… దాన్ని రాష్ట్రవ్యాప్తంగా మహా కూటమి ప్రచారం చేసుకునే అవకాశం ఉంటుంది. ఇప్పటికే, కేసీఆర్ కూడా మరోసారి ఆటాపాటల్నే ప్రచారానికి ప్రధాన మాధ్యమాలుగా ఎంచుకున్నారు. దానికి కౌంటర్ గా గద్దర్ గళమెత్తుతూ ఉండటం విశేషం.
ఏ పార్టీతో సంబంధం లేకుండా గద్దర్ ఒక్కరే రంగంలోకి దిగితే సరిపడా బలాన్ని ఆయన సొంతంగా కూడదీసుకోవడం అనేది సాధ్యమయ్యే పని కాదు! కాబట్టి, ఇతర పార్టీల మద్దతు ఆయనకీ అవసరం… ఆయనకి మద్దతు ఇవ్వడం కూటమికీ అవసరం. కేసీఆర్ మీద గద్దర్ లాంటివారిని రంగంలోకి దిగితే, ఎన్నికల ఫలితం అనూహ్యంగా మార్చేస్తారనే ఆశ కంటే… ఎన్నికల ప్రచారాన్ని మరింత ఆసక్తికరంగా మార్చుకునే అవకాశం కాంగ్రెస్ నేతృత్వంలోని కూటమికి ఉంటుంది. మరి, క్షేత్రస్థాయికి వచ్చాక గద్దర్ పనితీరు ఎలా ఉంటుందో, కూటమిలోని ఇతర పార్టీల మద్దతు ఏ స్థాయిలో ఉంటుందో చూద్దాం.