తెలంగాణ రాష్ట్ర సమితికి ఈవీఎంలపై అనుమానాలు క్రమంగా బలపడుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. ఈవీఎంలపై ప్రతిపక్షాల పోరాటానికి టీఆర్ఎస్ ఎప్పుడూ సహకరించలేదు. మద్దతు ప్రకటిచంలేదు. అదే సమయంలో.. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తమ అపజయానికి ప్రధాన కారణాల్లో ఒకటిగా..ఈవీఎంలను చెబుతూ వస్తోంది. ఈ పరిణామాలతో.. టీఆర్ఎస్… ఈవీఎంలపై అపనమ్మకం వ్యక్తం చేయలేని పరిస్థితి వచ్చింది. అయితే.. పార్లమెంట్ ఎన్నికల్లో.. తమ కంచుకోటల్లాంటి.. నియోజకవర్గాలైన.. ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్‌లలో.. భారీ తేడాతో ఓడిపోవడంతో.. ఆ పార్టీలోనూ.. అంతర్గత చర్చ ప్రారంభమయింది. అయితే.. ఎవరూ బయటపడలేని పరిస్థితి. అందుకే… మున్సిపోల్స్‌ను.. బ్యాలెట్‌తో నిర్వహించాలని నిర్ణయించారు.
త్వరలో జరగనున్న మున్సిపల్ ఎన్నికలను బ్యాలెట్ పద్ధతిలో నిర్వహించాలని తెలంగాణ ఎన్నికల సంఘం నిర్ణయించింది. ఇందుకోసం బ్యాలెట్ పత్రాలను స్థానికంగా ముద్రించుకోవచ్చని ఆదేశాలిచ్చింది. తెలంగాణలో 131 మున్సిపాలిటీలకు ఎన్నికలు జరగనున్నాయి. గతంలో గ్రేటర్ హైదరాబాద్, వరంగల్‌తోపాటు పలు కార్పొరేషన్లలో ఈవీఎంలతోనే ఎన్నికలు నిర్వహించారు. కానీ ఇప్పుడు మాత్రం బ్యాలెట్ పద్ధతిలో నిర్వహించాలని నిర్ణయించడం ఆసక్తికరంగా మారింది. ఈవీఎంలు తగినన్ని అందుబాటులో ఉన్నాయి. అసెంబ్లీ ఎన్నికలు ముగిసి.. ఆరు నెలలు దాటిపోయింది. కాబట్టి.. అప్పుడు వాడిన ఈవీఎంలు.. పనికొస్తాయి. ఇక సాంకేతిక ఇబ్బందుల విషయంలో.. ఇంజినీర్లు అందుబాటులో ఉన్నారు. నిజామాబాద్ ఎన్నిక.. దేశం దృష్టిని ఆకర్షించింది.
సహజంగా.. బీజేపీకి అర్బన్ ప్రాంతాల్లో బలం ఉందని చెప్పుకుటూ ఉంటారు. ఈవీఎంలు కాకుండా.. బ్యాలెట్లతో నిర్వహిస్తే.. బీజేపీ బలం ఏమిటో బయట పడుతుందని.. టీఆర్ఎస్ నేతలు భావించినట్లు చెబుతున్నారు. లేకపోతే.. ఈవీఎంలపై అమితమైన విశ్వాసం వ్యక్తం చేసే టీఆర్ఎస్.. మున్సిపల్ ఎన్నికల విషయంలో మాత్రం… బ్యాలెట్ పద్దతిని ఎంచుకోవడం…కచ్చితంగా.. చర్చనీయాంశం అవుతోంది. ఇప్పటికే… మండల, జడ్పీటీసీ ఎన్నికలు.. బ్యాలెట్లతో జరిగాయి. మున్సిపల్ ఎన్నికలు కూడా అలాగే జరిగితే.. అసలు పార్లమెంట్ ఎన్నికల్లో ఏం జరిగిందో ప్రజలే అంచనాకు వస్తారన్న గేమ్ ప్లాన్ టీఆర్ఎస్ అమలు చేస్తున్నట్లు.. ఇతర పార్టీలు భావిస్తున్నాయి. బ్యాలెట్లకు కాంగ్రె్స్ సంపూర్ణ మద్దతు ప్రకటించడం ఖాయమే. బీజేపీ ఇంకా స్పందించలేదు.