ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్‌లో ఎన్నికల నిర్వహణపై … అనుమాన మేఘాలు ఏర్పడుతున్నాయి. ఈవీఎలు వద్దే వద్దని అంటున్నవారి సంఖ్య అంతకంతకూ పెరిగిపోతోంది. అధికారంలో ఉన్న పార్టీలు మినహా.. ఇతర పార్టీలన్నీ.. బ్యాలెట్ పద్దతిలోనే ఎన్నికలకు వెళ్లాలనే డిమాండ్‌ను వినిపిస్తున్నాయి. తాజాగా బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఢిల్లీ పర్యటనలో ఈ విషయంపై కూడా వివిధ పార్టీలతో చర్చలు జరిపారు. దాదాపుగా 17 రాజకీయ పార్టీలు.. ఈవీఎంలకు వ్యతిరేకంగా… పోరాడాలని నిర్ణయింంచాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ 2019 ఎన్నికలు బ్యాలెట్లతోనే నిర్వహించాలని ఈ పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. వీటిలో తెలుగుదేశం పార్టీ కూడా ఉంది.
కొద్ది రోజులుగా కేంద్రంలో ఉన్న అధికార బీజేపీకి… ఉపఎన్నికల్లో ఘోర పరాజయాలు ఎదురవుతున్నాయి. అదే సమయం ఏదైనా రాష్ట్రంలో నేరుగా జరిగే ప్రత్యక్ష ఎన్నికల్లో ఏకపక్ష విజయాలు నమోదవుతున్నాయి. కర్ణాటక ఎన్నికల్లో బీజేపీకి తీవ్ర వ్యతిరేకత ఉందని.. విపరీతంగా ప్రచారం జరిగినా అతి పెద్ద పార్టీగా అవతరించింది. ఆ తర్వాత జరిగిన రెండు అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ.. కనీసం 40వేల ఓట్ల తేడాతో పరాజయం పాలైంది. ఇవన్నీ కలిసి.. వివిధ పార్టీలు ఈవీఎంల మీద అనుమానాలు పెంచుకోవడానికి కారణం అయ్యాయి. కొన్ని వీవీ పాట్ మిషన్లు కర్ణాటక ఎన్నికల తర్వాత చెత్త కుండీల్లో దొరకడం కూడా సంచలనాత్మకమయింది.
బీజేపీ ఈవీఎంలతో గెలుస్తుందని ఆరోపణలు ప్రధాన పార్టీల నుంచి కొద్ది రోజులుగా వస్తున్నాయి. బీజేపీ మిత్రపక్షం శివసేన కూడా ఇవే ఆరోపణలు చేస్తోంది. పైగా.. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో జోక్యం చేస్తున్న రష్యా .. ఇప్పుడు భారత్‌లో జరగనున్న ఎన్నికలపైనా దృష్టి పెట్టినట్లు ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు టెక్నాలజీని హ్యాక్ చేయడం ఎంత సులువో ట్రాయ్ చైర్మన్ ఆధార్ వ్యవహారమే బయపటెట్టింది.
నిజానికి అధికారంలో ఉన్న పార్టీలు మినహా మిగతా పార్టీలన్నీ.. ఈవీఎంలకు వ్యతిరేకంగా ఎప్పుటికప్పుడు ఆందోళన చేస్తూనే ఉన్నాయి. బీజేపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు.. ఈవీఎంలు ప్రజాస్వామ్యానికి పెను ప్రమాదంగా మారాయని ఆ పార్టీ నేతలు విమర్శలు చేశారు. జీవీఎల్ నరసింహారావు అయితే ఏకంగా ఓ పుస్తకం కూడా రాశారు. అప్పుడు కొట్టి పారేసిన కాంగ్రెస్ ఇప్పుడు.. ఈవీఎంలు వద్దని డిమాండ్ చేస్తోంది. ఒక్కసారే పదిహేడు కీలకమైన రాజకీయల పార్టీలు… బ్యాలెట్ డిమాండ్ ను ఈసీ ముందుకు తీసుకెళ్లాలని డిసైడ్ చేశాయి. కానీ అనుకూల నిర్ణయం వచ్చే అవకాశం మాత్రం లేదు.