జగన్మోహన్ రెడ్డి కుటుంబానికి చెందిన సాక్షి న్యూస్ ఛానల్ పై విశాఖ జిల్లాలో నిషేధం ఇంకా కొనసాగుతూనే ఉంది. విశాఖతో బాటు తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలలో కూడా నిషేధం కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. ఈ నిషేధం బహుశః మరికొంత కాలం కొనసాగవచ్చు. ప్రభుత్వం అవసరమని భావిస్తే మరికొన్ని జిల్లాలలో కూడా నిషేధం విదించే అవకాశాలు కనబడుతున్నాయి. తనపై, తన ప్రభుత్వంపై నిరాధారమైన ఆరోపణలు చేస్తున్న సాక్షి మీడియాపై కటిన చర్యలు తీసుకొంటానని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చాలా రోజులుగా హెచ్చరిస్తూనే ఉన్నారు. ముఖ్యమంత్రిని చెప్పులతో కొట్టాలని జగన్మోహన్ రెడ్డి ప్రజలకు సూచించినపటి నుంచి చంద్రబాబు నాయుడు సహనం కోల్పోయినట్లున్నారు.
ఆ తరువాత కూడా జగన్మోహన్ రెడ్డి, వైకాపా నేతలు ముద్రగడ పద్మనాభం వ్యవహారంలో ముఖ్యమంత్రిపై చాలా తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. ముద్రగడని అడ్డుపెట్టుకొని వైకాపా రాష్ట్రంలో అశాంతి సృష్టించే ప్రయత్నాలు చేస్తోందని ఆరోపిస్తున్న ప్రభుత్వం సరైన సమయం, అవకాశం చూసి సాక్షిపై వేటు వేసింది. సాక్షి మీడియాలో ముద్రగడ దీక్ష, అరెస్ట్ గురించి వైకాపా దృష్టి కోణం నుంచి వార్తలు, కధనాలు ప్రసారం చేస్తూ రాష్ట్రంలోని కాపు సామాజిక వర్గాన్ని రెచ్చడుతోందని ఆరోపిస్తూ ప్రభుత్వం గత మూడు రోజులుగా దానిపై అప్రకటిత నిషేధం అమలుచేస్తోంది.
ఈ నిషేధం ఇంకా ఎంత కాలం కొనసాగుతుందో తెలియదు కానీ దాని వలన వైకాపా దూకుడికి ప్రభుత్వం అడ్డుకట్ట వేసినట్లయింది. ఇది వైకాపా ఆయువుపట్టుపై దెబ్బగానే భావించవచ్చు. సాక్షి మీడియా కనుక లేకపోతే జగన్మోహన్ రెడ్డి తన అభిప్రాయాలను జనాలకి చేరవేసేందుకు అవకాశం ఉండదు. వేరే కొన్ని న్యూస్ ఛానల్స్ యాజమాన్యాలకి ఆయనపై సానుభూతి ఉన్నప్పటికీ, సాక్షి మాదిరిగా అవి జగన్, వైకాపాల కోసమే పూర్తిగా అంకితం కాలేవు. ఒకవేళ కాదలచుకొన్నా వాటికీ సాక్షి పరిస్థితే ఎదురయ్యే ప్రమాదం ఉంటుంది కనుక అవన్నీ ఆయనకి దూరంగానే ఉంటున్నాయి.
ఒకవేళ సాక్షిపై నిషేధం ఇంకా ఎక్కువ కాలం సాగినట్లయితే, సాక్షితో బాటు వైకాపా కూడా నష్టపోయే అవకాశం ఉంటుంది. ఈ సమస్యని కోర్టులకి వెళ్లో లేకపోతే కేంద్రానికి పిర్యాదు చేసో లేక మీడియా, ప్రతిపక్ష పార్టీల ద్వారా ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చో పరిష్కరించుకొందామని వైకాపా ప్రయత్నిస్తే ఎటువంటి ఫలితం ఉండబోదని తెలంగాణాలో నిరూపితమైంది. కనుక ఈ సమస్యని సామరస్యంగానే పరిష్కరించుకోక తప్పదు. కానీ జగన్ అందుకు అంగీకరించక పోవచ్చు కనుక సాక్షిపై నిషేధం ఇంకా కొనసాగవచ్చు. సాక్షిపై నిషేదం విదించడం గురించి రాష్ట్ర భాజపా నేతలు ఎవరూ ఇంతవరకు మాట్లాడలేదు కానీ భాజపా ఎమ్మెల్యే విష్ణు కుమార్ రాజు మాత్రం మీడియాపై ఆంక్షలు విదించడం సరికాదని అభిప్రాయం వ్యక్తం చేశారు.