Banaras movie Telugu review
సినిమా బ్యాక్ గ్రౌండ్ ఉన్న ఇంట్లోంచి ఓ హీరో వస్తున్నాడంటే కచ్చితంగా ప్రేక్షకుల్లో కొన్ని అంచనాలు ఏర్పడతాయి. మరీ అన్ని కాకపోయినా.. పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ ఉన్న ఓ కుటుంబం లోంచి హీరో పుట్టుకొస్తున్నాడన్నా… ఏవో కొన్ని లెక్కలు ఉంటాయి. జయేద్ ఖాన్ కూడా అలా అందరి కళ్లల్లో పడ్డాడు. కన్నడలో పేరు మోసిన ఓ రాజకీయ నేత వారసుడు జయేద్ ఖాన్. `బనారస్` అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చాడు. చేతిలో బోల్డంత డబ్బు. కావల్సిన టెక్నీషియన్లని, నటీనటుల్ని తీసుకొచ్చి సినిమా చేయించుకొనే సామర్థ్యం రెండూ జయేద్ ఖాన్‌కి ఉన్నాయి. దానికి తోడు అరంగేట్రంలోనే `పాన్ ఇండియా` సినిమా చేసేశాడు. దాంతో `బనారస్` ఎలా ఉంటుందో అన్న ఆసక్తి సగటు సినీ ప్రేక్షకుడికి కలిగింది. మరి… ఈ సినిమా కథేంటి? జయేద్ కి పర్ఫెక్ట్ ఎంట్రీ దొరికిందా, లేదా?
సిద్ద్ (జయేద్ ఖాన్) ఓ అల్లరి కుర్రాడు. తల్లి లేని పిల్లాడు కావడంతో తండ్రి మరీ గారాభంగా పెంచుతాడు. స్నేహితులతో బెట్ వేసి, ధని (సోనాల్) అనే అమ్మాయిని ట్రాప్ చేస్తాడు. అయితే సరదాగా చేసిన చిన్న తప్పు వల్ల ధని చాలా ఇబ్బంది పడుతుంది. హైదరాబాద్ వదిలి బనారస్ వెళ్లిపోతుంది. చేసిన తప్పు తెలుసుకొన్న సిద్ద్ ధనిని క్షమాపణ కోరడానికి బనారస్ వెళ్తాడు. అక్కడకు వెళ్లాక… సిద్ద్కి విచిత్రమైన అనుభవాలు ఎదురవుతాయి. అనుకోకుండా టైమ్ లూప్‌లో చిక్కుకొంటాడు. ఇంతకీ సిద్ద్ టైమ్ లూప్‌లో పడిపోవడానికి కారణమేంటి? ఆ టైమ్ లూప్‌లో తాను ఎదుర్కొన్న విచిత్రమైన పరిస్థితులేంటి? అనేది తెరపై చూడాలి.
టైమ్ లూప్ అనే కాన్సెప్ట్ ఇది వరకు మనకు పెద్దగా పరిచయం లేనిదే. కానీ ఈమధ్య అలాంటి కొన్ని సినిమాలు వచ్చాయి. `మానాడు`లో టైమ్ లూప్‌ని 360 కోణంలో వాడేశాడు వెంకట్ ప్రభు. అలాంటి టైమ్ లూప్ కాన్సెప్టే… ఈ బనారస్. సినిమా మొదలైన తొలి పది నిమిషాలూ చాలా ఆసక్తికరంగా ఉంటుంది. సిద్ద్ చెప్పే టైమ్ ట్రావెల్ కథ నిజంగానే ఇంట్రస్టింగ్ గా ఉంటుంది. సిద్ద్ టైమ్ ట్రావెల్ నుంచి వచ్చాడేమో..? అని ప్రేక్షకులూ నమ్మేస్తారు. కానీ అదంతా ట్రాప్ అని తెలుస్తుంది. ఆ తరవాత ధనిని వెదుక్కుంటూ బనారస్ వెళ్లడం, అక్కడ ధని కాళ్లా వేళ్లా పడడం.. ఇవన్నీ చక చక సాగిపోతాయి. ఇంట్రవెల్ లో టైమ్ లూప్‌లోకి కథ వెళ్తుంది. అక్కడి నుంచి సన్నివేశాలు కాస్త ఆసక్తిని కలిగిస్తాయి. టైమ్ లూప్‌లో ఇది వరకు వచ్చిన సినిమాలు చూసిన వాళ్లకు బనారస్ పెద్దగా నచ్చకపోవొచ్చు.కానీ ఇదే తొలిసారైతే.. కాస్త థ్రిల్ ఫీలవుతారు. టైమ్ లూప్‌ని నమ్ముకొన్న కథ ఇది. అలాంటప్పుడు ఆ కాన్సెప్ట్ ని వీలైనంత త్వరగా పరిచయం చేస్తే బాగుండేది. ఎక్కడో సెకండాఫ్‌లో అసలు కథలోకి వెళ్తానంటే ఎలా..? అప్పటి వరకూ రొటీన్ లవ్ స్టోరీ చూసే ఓపిక ప్రేక్షకులకు ఎక్కడిది? పైగా కథని సాగదీయడంలో భాగంగా పాటలు వచ్చి పడిపోతుంటాయి. అవన్నీ కథ వేగానికి బ్రేకులు వేసేవే. టైమ్ లూప్‌లో ఎందుకు పడ్డాడో చెప్పే క్లైమాక్స్ మరీ వీక్ గా ఉంది. పైగా లాజిక్ అస్సలు అందదు. టైమ్ లూప్ అనేదే లాజిక్ లేనిది. దాన్ని ఎంత కన్వెన్సింగ్ గా చెబితే అంత బాగుంటుంది. లాజిక్ లేని విషయాన్ని మరింత క్లూ లెస్ గా చెబితే ఎలా.?
సిద్ద్ కి ఇదే తొలి సినిమా. నటుడిగా ఓకే. స్క్రీన్ ప్రెజెన్స్ ఓకే. లవ్ స్టోరీలకు పనికొస్తాడు. కానీ.. డాన్సులు, ఫైట్ల విషయంలో ఇంకాస్త కసరత్తు చేయాలి. తన ప్రతిభంతా వెలికి తీసే కథ కూడా కాదిది. సోనాల్ పాత్ర, ఆమె నటన ఎలా ఉన్నా – తనైతే చూడ్డానికి హీరోయిన్గా మాత్రం లేదు. కథానాయిక ని కాపాడడానికి హీరో చేసే ప్రయత్నం ఈ సినిమా. కథానాయిక ఏమైపోతుందో? అన్న బెంగ ప్రేక్షకులకు కలగాలంటే.. చూడగానే ప్రేమలో పడిపోయేంత అందం హీరోయిన్ లో ఉండాలి. సోనాల్ హీరోయిన్లా కాకుండా… హీరోకి అక్కలానో, వదినలానో కనిపిస్తుంది. శంభు అనే పాత్ర బనారస్‌లో ఎంట్రీ ఇస్తుంది. ఆ పాత్ర బాగానే డిజైన్ చేశారు. శంభు పలికే మాటల్లో ఫిలాసఫీ ధ్వనిస్తుంటుంది. ఈ మూడు మినహా గుర్తుండిపోయే పాత్రలేం ఈ సినిమాలో కనిపించవు.
మాయా గంగ పాట బాగుంది. మిగిలిన పాటలు ఓకే అనిపించినా – కథకు స్పీడు బ్రేకర్లుగా మారడం వల్ల… ఆ పాటలు పెద్దగా ఎక్కవు. బనారస్ ని ఇంత విస్కృతంగా చూపించిన సినిమా ఇదేనేమో. పేరు పెట్టుకొన్నందుకు న్యాయం చేశారు. టైమ్ లూప్ కాన్సెప్ట్ మూడేళ్ల ముందు చెబితే బాగుండేది. ఎందుకంటే అప్పటికి ఇది కొత్త. ఇప్పుడు కాదు. ఇలాంటి కథలు చాలా చూసేశారు జనాలు. ఇప్పుడు మళ్లీ టైమ్ లూప్ కథ తీస్తుంటే.. దాన్ని ఇంకో కొత్త కోణంలో చెబితే బాగుండేది. లవ్ స్టోరీలో.. టైమ్ లూప్‌ని జోడించడం కొత్తగానే ఉంటుంది అని దర్శక నిర్మాతలు భావించి ఉంటారు. కానీ…. అది సరిపోలేదు.