హైదరాబాద్: కేంద్ర కార్మిక, ఉపాధిశాఖమంత్రి బండారు దత్తాత్రేయకూడా హైదరాబాద్‌లో అక్రమ నిర్మాణాల ముప్పు తప్పలేదు. రామ్‌నగర్‌లోని మంత్రి ఇంటిముందు ఒక భవన యజమాని నిబంధనలకు విరుద్ధంగా అంతస్తులమీద అంతస్తులు నిర్మిస్తున్నారు. దీంతో దత్తాత్రేయ జీహెచ్ఎమ్సీ అధికారులకు, పోలీస్ అధికారులకు స్ట్రాంగ్‌గా ఒక లేఖ రాశారు. సాక్షాత్తూ తన ఇంటిముందే అక్రమ భవన నిర్మాణాలు జరుగుతుంటే దిక్కులేదని, ఇక సామాన్యప్రజల పరిస్థితి ఏమిటని ఆ లేఖలో ప్రశ్నించారు. తన ఇంటిముందున్న ఒక యజమాని రెండు అంతస్తులవరకే అనుమతి ఉన్నప్పటికీ అక్రమంగా మరో మూడు అంతస్తులు కట్టారని తెలిపారు. అతను జీహెచ్ఎమ్సీ అధికారులను ప్రభావితంచేసి ఈ అక్రమ నిర్మాణాలు జరిపాడని ఆరోపించారు. ఈ అక్రమ నిర్మాణాలను వచ్చే ఏడాది చేపట్టే రెగ్యులరైజేషన్ డ్రైవ్ ద్వారా క్రమబద్ధీకరిస్తామనికూడా జీహెచ్ఎమ్సీ అధికారులు అతనికి హామీ ఇచ్చినట్లు తెలిసిందని మంత్రి తన లేఖలో పేర్కొన్నారు. జీహెచ్ఎమ్సీ ఉన్నతాధికారులు దీనిని ఎందుకు పట్టించుకోలేదని ప్రశ్నించారు. తెలంగాణలో ఉన్న ఏకైక కేంద్రమంత్రినైన తనకే భద్రత కల్పించలేని పోలీసులు సామాన్య మానవుడికి ఎలా కల్పిస్తారని అన్నారు. జీహెచ్ఎమ్సీ అధికారుల లెక్కల ప్రకారం హైదరాబాద్ నగరంలో సుమారు 67,000 అక్రమ నిర్మాణాలున్నాయి.