భారతీయ జనతా పార్టీకి అప్పుడెప్పుడో బంగారు లక్ష్మణ్ జాతీయ అధ్యక్షుడు అయ్యారు. ఇప్పుడు మరో లక్ష్మణ్ కూడా అధ్యక్షుుడు అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం బీజేపీ ఓబీసీ మోర్చా అధ్యక్షుడిగా ఉన్న కె. లక్ష్మణ్ ను బీజేపీ అధ్యక్ష పదవిలోకి పరిగణనలోకి తీసుకుంటున్నారు. ప్రస్తుత అధ్యక్షుడు జేపీ నడ్డా మోదీ కేబినెట్లో చేరారు. ఈ కారణంగా ఆయన స్థానంలో మరో నేతను నియమించాల్సి ఉంది.
జేపీ నడ్డా ను తప్పిస్తే… మధ్యప్రదేశ్ మాజీ సీఎం … ఆ రాష్ట్రంలో క్లీన్ స్వీప్ విజయాన్ని సాధించి పెట్టిన శివరాజ్ సింగ్ చౌహాన్ ను బీజేపీ అధ్యక్షుడిగా చేస్తారని అనుకున్నారు. ఆయనకు దేశవ్యాప్త ఇమేజ్ ఉంది. అయితే అనూహ్యంగా ఆయననూ కేబినెట్ లోకి తీసుకున్నారు. ఒడిషా నేత ధర్మేంద్ర ప్రధాన్ రేసులో ఉంటారనుకుంటే ఆయనకూ కేబినెట్ బెర్త్ దక్కింది. ఇతర ప్రముఖ నేతలు కూడా కేబినెట్ లో చేరడంతో బీజేపీ అధ్యక్షుడిగా ఎవరని నియమిస్తారోనన్న చర్చ జరుగుతోంది.
రాజ్యసభ సభ్యుడిగా ఉన్న లక్ష్మణ్ పేరు ప్రధానంగా వినిపిస్తోంది. తెలుగు రాష్ట్రాలను బీజేపీ టార్గెట్ గా పెట్టుకుందని .. అందుకే కె.లక్ష్మణ్‌ను నియమించవచ్చని అంటున్నారు. అదే సమయంలో బీజేపీ టార్గెట్ గా బెంగాల్ కూడా ఉంది. బెంగాల్ , యూపీకి చెందిన కొంత మంది నేతల పేర్లు తెరపైకి వస్తున్నాయి.అయితే వీరెవరూ..పెద్దగా ప్రజాబలం ఉండేవాళ్లు కాదు. మోదీ, షా కనుసన్నల్లో నడిచే వాళ్లే.