ఏపీలో హాట్ హాట్ సీట్లలో మచిలీపట్నం ఒకటి. . వైసీపీ మార్క్ రాజకీయ విమర్శలతో కొడాలి నానితో పాటు పేర్ని నాని కూడా హైలెట్ అయ్యారు. ఇప్పుడు ఆయన వైదొలిగి ఆయన కుమారుడికి సీటు ఇప్పించుకున్నారు. టీడీపీ తరపున మాజీ మంత్రి కొల్లు రవీంద్రనే పోటీ చేయనున్నారు. పోటీ హోరాహోరీగా ఉన్నా జనసేనతో పొత్తు మాత్రం టీడీపీకి అడ్వాంటేజ్ గా మారనుంది. పేర్ని నాని పారిపోయాడన్న పేరు.. పేర్ని కిట్టు చిల్లర తనం ప్రజల్లో నెగెటివ్‌గా మారుతోంది.
మూడేళ్ల నుంచి పేర్ని నాని అస్త్ర సన్యాస ప్రకటనలు
ప్రస్తుతం మచిలీపట్నం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వైసీపీ తరఫున పేర్ని నాని ఎమ్మెల్యేగా వ్యవహరిస్తున్నారు. గత ఎన్నికల్లో మాజీ మంత్రి కొల్లు రవీంద్రపై పోటీ చేసిన నాని ఘన విజయం సాధించారు. రెండున్నరేళ్లు మంత్రిగా పనిచేసిన పేర్ని నాని.. సీఎం జగన్‌కు అత్యంత సన్నిహితుల్లో ఒకరిగా చెబుతుంటారు.. సిట్టింగ్ ఎమ్మెల్యే నాని పోటీకి దూరంగా ఉంటానని ప్రకటించి రాజకీయ వారసుడ్ని సమన్వయకర్తగా నియమింప చేసుకున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే నాని.. ఈ సారి పోటీచేసేది లేదని మంత్రిగా ఉన్నప్పుడు మూడేళ్ల క్రితమే ప్రకటించారు. తాను రాజకీయాల్లో యాక్టివ్‌గా ఉన్నప్పుడే తన కుమారుడిని ఎమ్మెల్యే చేయాలనేది నాని ప్లాన్. బందరు పోర్టు శంకుస్థాపనకు వచ్చిన సీఎం జగన్ సమక్షంలోనే తాను ఎన్నికల్లో పోటీ చేయబోవటం లేదని ప్రకటించారు పేర్ని నాని. వచ్చే ఎన్నికల్లో వారసులకు టిక్కెట్లు ఇచ్చేది లేదని అంతకుముందే సీఎం జగన్ చెప్పినా.. నాని మాత్రం తన పంతాన్ని నెగ్గించుకున్నారు.
ప్రజల్లో సౌమ్యుడిగా ..కలసిపోయే నేతగా మంచి పేరు తెచ్చుకున్న కొల్లు రవీంద్ర
అధికార పార్టీ రాజకీయాలు ఇలా ఉంటే టీడీపీ నుంచి మాజీ మంత్రి కొల్లు రవీంద్ర పోటీ చేయబోతున్నారు. ప్రభుత్వంపై వ్యతిరేకత బలంగా ఉందనే భావనతో ఉన్న టీడీపీ.. ఈ సారి బందరు సీటు కచ్చితంగా తమదేననే ధీమాతో ఉంది. బందరు సెగ్మెంటులో టీడీపీలో పెద్దగా గ్రూపులు లేకపోవడం ఆ పార్టీకి అడ్వాంటేజ్ అవుతుందని చెబుతున్నారు. గత ఎన్నికల్లో జనసేన కాపు సామాజిక వర్గ ఓట్లను చీల్చటం వల్లే రవీంద్ర ఓడిపోయారనే భావనలో ఉంది తెలుగుదేశం పార్టీ. ఈ సారి పొత్తు ఉండటంతో ఇక తిరుగు ఉండదని అనుకుంటున్నారు. గతంలో రాముడు మంచి బాలుడిలా కనిపించిన కొల్లు రవీంద్ర ఇప్పుడు మాస్ లీడర్ అవతారం ఎత్తుతున్నారు. ఎలాంటి సమస్య ఎదురైనా చిటికెలో వాలిపోతున్నారు. టిడిపి అధినేత చంద్రబాబుకు సైతం అత్యంత సన్నిహితుడిగా గుర్తింపు తెచ్చుకున్నే రవీంద్ర.. పార్టీలోనూ బీసీ ఫెడరేషన్ బాధ్యతలను చూస్తున్నారు. రవీంద్రపై హత్యాయత్నం కేసుని పెట్టి జైలుకు పంపడాన్ని బందరు ప్రజానీకం, ముఖ్యంగా టీడీపీ క్యాడర్ జీర్ణించుకోలేకపోతున్నారు. మత్స్యకార సామాజిక వర్గానికి చెందిన కొల్లు రవీంద్రకు ఆ వర్గం ఓట్లు అదనపు బలం ..
పవన్ ను వ్యక్తిగతంగా దూషించి మరింతగా పలుచనైన పేర్ని నాని
మాజీ మంత్రి పేర్ని నాని సమయం సందర్భం లేకుండా జనసేనాని పవన్ కళ్యాణ్‌ని టార్గెట్ చేయడం.. ఆ సామాజిక వర్గంలో విస్తృత చర్చకు దారితీస్తోంది. ఇది ఎవరికి ప్లస్సో.. ఎవరికి మైనస్‌గా మారుతోందోననే విశ్లేషణలకు ఎక్కువగా జరుగుతున్నాయి. నాని కూడా అదే సామాజిక వర్గానికి చెందిన నేత కావడం.. టీడీపీతో జనసేన పొత్తును తప్పుబడడుతుండటం కూడా ఇక్కడ ప్రధానంగా చర్చకు వస్తోంది. నియోజకవర్గంలో రోజురోజుకి క్షీణిస్తున్న శాంతి భద్రత సమస్య వచ్చే ఎన్నికల్లో తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. . టీడీపీ-జనసేనతో పొత్తు ఖరారవడంతో వైసీపీకి ఆశలు మిణుకుమిణుకుమంటున్నాయి తప్ప.. పెద్దగా హోప్స్ లేవన్న భావన వైసీపీ వర్గాల్లో ఏర్పడుతోంది.