హైదరాబాద్లో టీఆర్ఎస్, బీజేపీ మధ్య మరో రగడ ప్రారంభమైంది. చివరికి బండి సంజయ్ ..తెలంగాణ సీఎం కేసీఆర్కు హిందువో.. బొందువో తేల్చుకోవాలని సవాల్ చేసే స్థాయి పరిస్థితి ఏర్పడ్డాయి. పాతబస్తీ ప్రాంతంలోని ఉప్పుగూడలో కాళీ మాత దేవాలయ భూముల వివాదం కేంద్రంగా కొత్త రాజకీయం ప్రారంభమయింది. దేవాదాయ శాఖకు చెందిన స్థలాన్ని ఓ వ్యక్తి తనదని వాదిస్తూ నిర్మాణాలు చేపట్టారు. కోర్టు ఆర్డర్లు ఉన్నాయని పోలీసులు కూడా రక్షణ కల్పించారు. ఈ నిర్మాణాలను అడ్డుకోవడానికి బీజేపీ నేతలు ప్రయత్నించారు. ఈ ఘర్షణలో ఓ బీజేపీ నేత గుండె పోటుకు గురై చనిపోయాడు. ఆ తర్వాత నిర్మాణాలను అడ్డుకుంటున్న బీజేపీ కార్యకర్తల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ విషయం గంటల్లోనే పెద్దదైపోయింది.
నిజానికి కాళీమాత ఆలయ భూముల వివాదం కోర్టుల్లో ఉంది. ఆ భూములను వేలం వేయలేదు. ఆలయ భూములు తనవేనని చెబుతున్ నవ్యక్తి ఎంఐఎంకు చెందిన వాడుకావడంతో వివాదం మరింత పెరిగింది. అరెస్ట్ చేసిన బీజేపీ కార్యకర్తలను పరామర్శించేందుకు బండి సంజయ్ వెళ్లడంతో ఇష్యూ మరింత పెద్దయింది. సీఎం కేసీఆర్ వల్లే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని బండి సంజయ్ మండిపడ్డారు. కాళీమాత ఆలయ ఘటనపై 24 గంటల్లో సీఎం, డీజీపీ స్పందించాలని లేకపోతే.. తప్పదని సంజయ్ వార్నింగ్ ఇచ్చారు. పాతబస్తీలో బీజేపీ చేపట్టబోయే ఉద్యమానికి..ప్రభుత్వమే బాధ్యత వహించాలని కూడా హెచ్చరించారు.
హిందువో.. బొందువో సీఎం కేసీఆరే తేల్చుకోవాలన్నారు. గతంలో లోక్సభ ఎన్నికల సమయంలో కరీంనగర్ సభలో బీజేపీ నేతలను ఉద్దేశించి హిందూబగాళ్లు.. బొందూగాళ్లు అంటూ కేసీఆర్ మాట్లాడారు. ఆ మాటల వల్లే సెంటిమెంట్ పెరిగిపోయి.. బండి సంజయ్ గెలిచారన్న ప్రచారం కూడా ఉంది. అదే మాటలను ఇప్పుడు బండి సంజయ్ గుర్తు చేశారు. మా సహనం నశిస్తే పాతబస్తీ ఏమవుతోందో పోలీసులు గుర్తుంచుకోవాలని హెచ్చరించారు. మత కలహాలు సృష్టించి నెపాన్ని బీజేపీపై వేయాలని.. పోలీసులు ప్రయత్నిస్తున్నారని ఎమ్మెల్యే రాజాసింగ్ అంటున్నారు. నిన్నటిదాకా భాగ్యలక్ష్మి ఆలయం బీజేపీకి గొప్పగా కనిపిస్తూ ఉండేది ఇప్పుడు.. భాగ్యలక్ష్మి ఆలయానికి తోడు కాళీ మాత ఆలయం కూడా జత చేరినట్లయింది. కాళీ మాత ఆలయం కేంద్రంగా రాజకీయం చేయడానికి బండి సంజయ్ కావాల్సినంత సరంజామాను.. సవాల్ ద్వారా ఇప్పటికే రెడీ చేసుకున్నారు .