తెలంగాణకు ఇద్దరు ముఖ్యమంత్రులు ఉన్నారని ఒకరు రేవంత్ అయితే..మరొకరు కేటీఆర్ అని బండి సంజయ్ ఆరోపించారు. వారిద్దరూ కలిసి నాటకాలు ఆడుతూ బీజేపీని ఎదగకుండా చేస్తున్నారని ఆయన అంటున్నారు. రేవంత్‌తో తనకు వ్యాపార సంబంధాలు ఉన్నాయని ఆరోపిస్తున్నారని నిరూపిస్తే తాను రాజకీయాల నుంచి వైదొలుగుతానన్నారు. కానీ రేవంత్ కు.. కేసీఆర్ కుటుంబానికి సంబంధాలు ఉన్నాయని తాను నిరూపిస్తానన్నారు. వారిద్దరూ ఒక్కటేనని స్పష్టం చేశారు.
అందుకే రేవంత్ రెడ్డి చర్యలు తీసకోవడం లేదని స్పష్టం చేశారు. లగచర్ల దాడి ఘటనలో కేటీఆర్ కుట్ర ఉందని చెబుతున్నా ఎందుకు అరెస్టు చేయలేదని ప్రశ్నించారు, ఫోన్ ట్యాపింగ్ కేసు సిరిసిల్ల కేంద్రంగా జరిగిందని కేటీఆర్‌కు , కేసీఆర్‌కు తెలియకుండా జరుగుతుందా అని బండిసంజయ్ ప్రశ్నించారు. కాళేశ్వరం దగ్గర నుంచి అనేక స్కాముల్లో బీఆర్ఎస్ నేతల ప్రమేయం ఉందని ఆరోపిస్తున్నా ఎందుకు ఇప్పటి వరకూ చర్యలు తీసుకోలేదో చెప్పాలన్నారు. తము ఫార్మా పరిశ్రమలు పెట్టడానికి వ్యతిరేకం కాదని.. కానీ బలవంతంగా భూములు గుంజుకోవద్దన్నారు. లగచర్ల దాడి ఘటన పూర్తిగా ప్రభుత్వ వైఫల్యమేనని చేతకాని ముఖ్యమంత్రి ఉంటే ఇలాగే జరుగుతుందన్నారు.
అయితే బండి సంజయ్ లగచర్ల దాడి ఘటన రైతులు చేయలేదని అంటున్నారు. ఖచ్చితంగా బీఆర్ఎస్ నేతల కుట్రేనని ఆయన స్పష్టంచేశారు. రైతులు అలా కలెక్టర్ పై దాడి చేయబోరన్నారు. బండి సంజయ్ మొదటి నుంచి రేవంత్ కంటే బీఆర్ఎస్ కే తీవ్ర వ్యతిరేకత చూపిస్తూంటారు. ముందుగా రేవంత్ సవాల్ చేసినట్లుగా ఆ పార్టీ అగ్రనేతల్ని అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూంటారు. బహుశా ఆయనను కూడా కేటీఆర్ పలుమార్లుఅరెస్టు చేయించారు. అందుకే ప్రతీకారం కోరుకుంటున్నారు. కానీ అది మాత్రం తీరడం లేదు.