ప్రధాని మోదీకి ఎవరైనా కాళ్లు మొక్కితే.. ఆయన వెంటనే ఆ మొక్కిన వాళ్ల కాళ్లు మొక్కుతారు. ఎందుకంటే .. తన కాళ్లకు ఎవరైనా మొక్కడాన్ని ఆయన ఇష్టపడరు. అలాంటిది ఇక చెప్పులు ఇతరులు అందిస్తారంటే ఊరుకుంటారా ? ఇప్పటి వరకూ అలాంటి ఘటన జరగలేదు. కానీ ఆయనకు భిన్నం హోంమంత్రి అమిత్ షా. బండి సంజయ్ గుడి దగ్గర చెప్పులు చేత్తో తీసి కాళ్ల దగ్గర పెడుతూంటే కనీసం వారించలేదు. బండి సంజయ్ కూడా దీన్నో ప్రశంసగా తీసుకున్నారు.
బాంచన్ నీ కాల్మోక్తా ! సంప్రదాయాన్ని మళ్లీ తెచ్చిన బండి సంజయ్ !
బాంచన్ నీ కాల్మోక్తా ! … అనే పదం తెలంగాణ సమాజంలో బానిసత్వానికి పర్యాయపదం. దొరలను అలా అనకపోతే బతకలేని పరిస్థితి అప్పట్లో ప్రజలకు ఉండేది. అలాంటి అణిచివేత స్థితి నుంచే సాయుధ పోరాటం ఉద్భవించింది. తెలంగాణ సమాజంలోఈ పోరాటాలది ప్రత్యేకపాత్ర. ప్రత్యేక రాష్ట్రం కూడా అలాగే సాధించుకున్నారు. ఇంత చరిత్ర ఉన్న తెలంగాణ సమాజంలో కొంత మంది తమ తరాన్ని మళ్లీ బానిసత్వంలోకి తీసుకెళ్తున్నారా అన్న అనుమానాలు ఇప్పుడు కలిగేలా చేస్తున్నారు. దీనికి ఉదాహరణ.. బండి సంజయ్ ప్రవర్తన.
గుడి దగ్గర షా కాళ్లకు చెప్పులు తొడిగినంత పని చేసిన బండి సంజయ్
హైదరాబాద్ పర్యటనకు వచ్చిన అమిత్ షా ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన ఆలయం బయట చెప్పులు విడిచి వెళ్లారు. తిరికి వచ్చేటప్పుడు ఆయన కంటే ముందే బండి సంజయ్ పరుగులాంటి నడకతో బయటకు వచ్చి.. అమిత్ చెప్పులు తీసి ఆయన కాళ్ల దగ్గర పెట్టారు. దర్జాగా అమిత్ షా వాటిని వేసుకున్నారు. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇంత అవసరమా? అన్నదే అందరి అభిప్రాయం. చివరికి బీజేపీలో ఎక్కువ మంది అభిప్రాయం కూడా ఇదే.
తెలంగాణ ఆత్మగౌరవం ఏమైపాయే !
ఉత్తరాది నేతలు దక్షిణాది నేతల్ని కించపర్చడం అనేది రాజకీయంగా ఎన్నో సార్లు దుమారం రేపింది. ఈ అంశమే తెలుగుదేశం పార్టీ పుట్టుకకు కారణం అయింది. ముఖ్యమంత్రిగా ఉన్న అంజయ్యను ప్రధాని కూడా కాని రాజీవ్‌ను ఘోరంగా అవమానించడంతోనే తెలుగువారి ఆత్మగౌరవ నినాదం వెలుగులోకి వచ్చింది. అందకు ముందు ఎంత మంది ఢిల్లీ నేతలకు సాష్టంగ ప్రమాణాలు చేసినా.. ఆ తర్వాత గౌరవంగా మసలు కోవడం ప్రారంభించారు. ఓ స్థాయికి వచ్చాక చెప్పులు మోయడం లాంటివి చేయలేదు. అలాంటి ఆలోచనే తప్పు అనే భావనకు వచ్చారు. కానీ ఇప్పుడు బండి సంజయ్ మళ్లీ తెలుగు రాజకీయాల్ని పాత కాలానికి తీసుకెళ్లారు.
అచ్చం దొరలాగే వ్యవహరించిన అమిత్ షా !
నిజానికి ఇక్కడ బండి సంజయ్ ది మాత్రమే అలాంటి స్వభావం కాదు. అమిత్ షాదీ కూడా అంతే. ఆయన అచ్చం దొరలా వ్యవహరించారు. చెప్పులు తీసి ఇస్తే చక్కగా వేసుకున్నారు కానీ.. వద్దని బండి సంజయ్‌ను వారించలేదు. ఈ వీడియో బయటకు వచ్చింది కాబట్టి.. బండి సంజయ్.. ఆయన పెద్దవారు కాబట్టి గౌరవించానని కవర్ చేసుకోవచ్చు.. కానీ ఆయన తెలంగాణ ప్రజాప్రతినిధి అనే సంగతిని గుర్తుంచుకుంటే.. తన ఆత్మగౌరవం కాపాడుకోవడం అంటే ప్రజల ఆత్మగౌరవం కాపాడినట్లేనని భావిస్తారు. కానీ అలాంటి అవకాశం లేకుండా పోయింది.