ప్రజా సంగ్రామ యాత్ర పేరిట పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన తొలివిడత పాదయాత్ర విజయవంతం అయిందని బీజేపీ వర్గాలు గట్టి నమ్మకంతో ఉన్నాయి. దీనికి కొనసాగింపుగా మార్చి 2, 3 వారాల్లో మలివిడత ప్రజా సంగ్రామయాత్రను జోగుళాంబ దేవాలయం నుంచి మొదలుపెట్టి భద్రాచలం శ్రీసీతారామచంద్ర ఆలయం వద్ద ముగించాలని బండి సంజయ్ ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు. దీనికి హైకమాండ్ అనుమతి రావాల్సి ఉంది. హుజురాబాద్ ఎన్నికలు ముగిసిన తర్వాత నుంచి అదే పనిగా రెండో విడత పాదయాత్ర కోసం సన్నాహాలు చేస్తున్నా ప్రయోజనం ఉండటం లేదు. ఇప్పుడు మరోసారి ప్రణాళిక సిద్ధం చేశారు.
పాదయాత్రతో పాటు టీఆర్ఎస్ అమలు చేయని హామీలపై కొత్త కార్యాచరణ ప్రకటించాలని బీజేపీ నిర్ణయించింది. శాసనసభకు ముందస్తు ఎన్నికలు ఖాయమని జాతీయ నాయకత్వం రాష్ట్ర నాయకత్వానికి సమాచారం పంపింది. దానికి తగ్గట్లుగా పోరాట ప్రణాళికలు అమలు చేయాలని నిర్ణయించింది. పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడంలో భాగంగా పార్లమెంటరీ నియోజకవర్గాల పరిధిలో నాయకు లు, కార్యకర్తలను క్రియాశీలం చేసి, ఎన్నికలకు స న్నద్ధం చేయాలని భావిస్తున్నారు.
కిందిస్థాయి నుంచి పార్టీ శ్రేణులను ఎన్నికల కార్యాచరణకు సిద్ధం చేస్తూనే, రాష్ట్రంలో వివిధ వర్గాల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై దరఖాస్తుల ఉద్యమం చేపట్టాలని రాష్ట్ర నాయకత్వం నిర్ణయించింది. వీటన్నింటి ద్వారా ప్రజల్లో ఎప్పుడూ ఉండేందుకు బీజేపీ సర్వశక్తులా ప్రయత్నిస్తోంది. ఎంత హైప్ వస్తున్నప్పటికీ ఇప్పటికీ చాలా నియోజకవర్గాల్లో గట్టి నేతలు లేరు. అందు కోసం ముఖ్య నేతల చేరికలకూ సన్నాహాలు చేసుకుంటున్నారు.