కుటుంబ కార్యక్రమంలో పాల్గొనేందుకు కరీంనగర్ వెళ్లిన బండి సంజయ్‌ను పోలీసులు అర్థరాత్రి అరెస్ట్ చేసి హైదరాబాద్‌కు తరలించారు. కేసేంటో తెలియదు కానీ.. ఆయన పేపర్ లీక్ కేసులో కుట్ర చేశారని బీఆర్ఎస్ కార్యకర్తలు ప్రచారం ప్రారంభించారు. దీంతో ఆయనపై పేపర్ లీక్ కుట్ర కేసు పెట్టబోతున్నారన్న చర్చ జరుగుతోంది. ఏపీలో టెన్త్ పేపర్ల లీక్ ఆరోపణలు వచ్చినప్పుడు టీడీపీకి చెందిన విద్యాసంస్థల అధినేత నారాయణను టార్గెట్ చేశారు. నిజానికి అది లీక్ కాదని పరీక్ష ప్రారంభమైన తర్వాత ఉపాధ్యాయులు బయటకు పంపుతున్నారు కాబట్టి మాల్ ప్రాక్టీస్ అని అధికారులు మీడియాకు చెప్పేవారు.
అయితే ఈ వివాదంలో విపక్ష నేతల్ని ఇరికించేయాలి కాబట్టి నారాయణను అరెస్ట్ చేసేశారు. ఇప్పుడు అదే ఫార్ములాను తెలంగాణ ప్రభుత్వం పాటిస్తున్నట్లుగా కనిపిస్తోంది. రెండురోజుల నుంచి జరుగుతున్న టెన్త్ పరీక్షల్లో రెండు పేపర్లూ పరీక్ష ప్రారంభమైన తర్వాత వెలుగులోకి వచ్చాయి. దీనికి కారణమైన ఉపాధ్యాయుల్ని గుర్తించారు. అయితే వరంగల్‌లో బయటకకు వచ్చిన హిందీ పేపర్ విషయంలోనూ ఇలాగే ప్రచారం చేసి బండి సంజయ్‌పై కేసు పెట్టి అరెస్ట్ చేశారన్న అభిప్రాయం వినిపిస్తోంది. ఇప్పటికే టీఎస్పీఎస్సీ పేపర్ల లీకేజీ విషయంలో ప్రభుత్వం ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటోంది. ఇప్పుడు టెన్త్ పరీక్షలు కూడా పెట్టలేకపోతున్నందున … ప్రభుత్వాన్ని రద్దు చేయాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది. ఇదే బండి సంజయ్‌పై కేసు పెట్టడానికి కారణమయిందని చెబుతున్నారు.
తెలంగాణలో ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో ప్రతి అంశం రాజకీయం అవుతోంది. ఏదైనా తప్పు జరిగితే… ప్రభుత్వంపై ఆరోపణలతో విరుచుకుపడటం విపక్షాలు చేసేదే. అయితే గతంలో వారిపై ఆ తప్పులకు కారణం విపక్ష నేతలే అని కేసులు పెట్టి అరెస్టు చేయడం అరుదు. కానీ ఇటీవలి కాలంలో ఎలాంటి సాక్ష్యాలు లేకపోయినా… ఎవరో ఒకరి స్టేట్ మెంట్ ఆధారంగా అరెస్టులు చేయడం కామన్ అయిపోతోంది. విపక్ష నేతల్ని కేసుల్లో ఇరికించి… అదే గొప్ప విషయమన్నట్లుగా రాజకీయం చేసుకంటున్నారు. దీంతో రాజకీయం తీరు మారిపోతోంది.