టీఎస్పీఎస్సీ పేపర్ల లీకేజీ..ఇప్పుడు టెన్త్ పేపర్ల లీకేజీల విషయంలో ప్రభుత్వాన్ని ఇరుకున పెడదామని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన ప్రయత్నాలు వికటించాయి. సాక్షాత్తూ తెలంగాణ బీజేపీ అధ్యక్షుడే టెన్త్ పేపర్ లీకేజీకి కుట్ర పన్నినట్లుగా పోలీసులు కేసు పెట్టేశారు. ఇందులో సాక్ష్యాలు ఉన్నాయా … లేవా అన్న సంగతి పక్కన పెడితే.. ఈ వ్యవహారం బీజేపీకి ఇబ్బందికరంగా మారడం ఖాయంగా కనిపిస్తోంది. ఎమ్మెల్యేలతో చేసిన బేరాల్లా ఇది రాజకీయం కాదు. లక్షల మంది విద్యార్థుల భవిష్యత్‌తో ముడిపడిన అంశం.
తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఉద్యోగ పరీక్షల విషయంలో పేపర్ లీకేజీ వ్యవహారం అనూహ్యంగా బయటకు వచ్చింది. ఆ లీకేజీలు చిన్నవి కావని మంత్రి కేటీఆర్‌ను టార్గెట్ చేసుకుని బండి సంజయ్ తీవ్ర ఆరోపణలు చేశారు. . అదే సమయంలో టెన్త్ పశ్నాపత్రాలు పరీక్ష ప్రారంభమైన వెంటనే బయటకు వస్తూండటంతో ఆయన మరింత రాజకీయం చేశారు. అసలు పరీక్షల్ని పెట్టడం చేత కాని ప్రభుత్వాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కానీ అనూహ్యంగా ఇప్పుడు ఆ ప్రశ్నాపత్రాల లీకేజీలో తానే ఆరోపణలు ఎదుర్కొంటూ జైలుకు వెళ్లాల్సి వచ్చింది.
ప్రశాంత్ అనే జర్నలిస్టుతో బండి సంజయ్ కు పరిచయం ఉంది. నిజానికి ఆయన ఓ ప్రముఖ చానల్‌ను జిల్లా స్థాయి రిపోర్టర్ గా చేసినందున దాదాపుగా అందరితో పరిచయాలు ఉంటాయి. బీజేపీ నేతలతో ఎక్కువ సన్నిహితంగా ఉంటారు. ప్రశాంత్ పేపర్ ను వైరల్ చేశాడని పోలీసులు చెబుతున్నారు కానీ ఆ పేపర్ ఆయనే లీక్ చేశాడని చెప్పడం లేదు. ఆలా వైరల్ చేసే క్రమంలో బీజేపీ నేతలకు పంపారు. బండి సంజయ్‌కు ఫోన్ చేశారు. ఈ ఫోన్ కాల్ మాట్లాడటాన్నే పోలీసులు కుట్రగా చేసి ఏ వన్ గా చేసేశారు. ఇక్కడే బండి సంజయ్ ఇరుక్కుపోయారు.
ప్రభుత్వంపై ప్రజల్లో ముఖ్యంగా యువతలో వ్యతిరేకత పెంచడానికి ఈ పేపర్ల లీకులు బాగా ఉపయోగపడతాయని విపక్షాలు అనుకోవడం సహజం. అయితే వారిని కట్టడి చేయడానికి అధికార పార్టీ కూడా ప్రయత్నిస్తుందని ఈ విషయంలో వారికి దొరికిపోకూడదని జాగ్రత్తగా ఉండలేపోయారు. నిజంగా పేపర్ లీకేజీ చేయాలని బండి సంజయ్‌కు ఉండకపోవచ్చు. కానీ ఇలా బయటకు వచ్చిన పేపర్లతో వీలైనంత ఎక్కువగా రాజకీయం చేయాలనుకున్నారు. అక్కడే ఇబ్బంది పడ్డారు. ఇప్పుడు పోలీసులు బండి సంజయ్ కుట్ర చేశారని నిరూపించలేకపోయినా బీజేపీకి బండి సంజయ్‌కు జరిగిన నష్టం జరిగిపోతుంది.