తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్.. బీఆర్ఎస్ నేతలు ఆందోళనలు చేయడానికి కావాల్సిన పరిస్థితుల్ని తన మాటల ద్వారా తరచూ కల్పిస్తూనే ఉన్నారు. తాజాగా బీఆర్ఎస్ నేతలు ఇటు తెలంగాణతో పాటు అటు ఢిల్లీలో కూడా బండి సంజయ్ కు వ్యతిరేకంగానే నిరసనలు నిర్వహించారు.సాధారణంగా ఈడీకి వ్యతిరేకంగా నిరనసలు చేశారని అనుకుంటారు. కానీ ఈడీ విచారణ కన్నా బండి వ్యాఖ్యలే బీఆర్ఎస్ క్యాడర్‌కు ఎక్కువ కోపం తెప్పించాయి. గల్లీ నుంచి ఢిల్లీ దాకా బండి సంజయ్ దిష్టిబొమ్మలు దహనం చేశారు.
అంతే కాదు బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలపై విచారణ జరపాలని డీజీపీకి తెలంగాణ మహిళా కమిషన్ చైర్మన్ సునీతా లక్ష్మారెడ్డి ఆదే్శాలు జారీ చేశారు. ఎమ్మెల్సీ కవితపై బండి సంజయ్ వ్యాఖ్యల్ని మహిళా కమిషన్ సుమోటోగా తీసుకుంది. వ్యక్తిగతంగా హాజరు కావాలని మహిళా కమిషన్ ఆదేశించింది. తెలిపింది. సంజయ్ వ్యాఖ్యలపై బీఆర్ఎస్ మహిళా ప్రజాప్రతినిధులు జాతీయ మహిళా కమిషన్‌కు కూడా ఫిర్యాదు చేశారు.
శుక్రవారం ఓ బీజేపీ కార్యక్రమంలో మాట్లాడిన బండి సంజయ్ సీఎం కూతురు మాత్రమే గొప్ప అన్నట్లు బీఆర్ఎస్ నాయకుల ప్రవర్తన ఉందని సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈడీ కేసులకు బీజేపీకి ఎటువంటి సంబంధం లేదని, తప్పు చేయకుంటే కోర్టు ద్వారా నిరూపించుకుని బయటకు రావాలని ఆయన అన్నారు. ఇంతక ముందే మీడియా వాళ్లు కవితను అరెస్ట్ చేస్తారని ఓ ప్రశ్నఅడిగారని, దోషిగా తేలితే అరెస్ట్ చేయక ముద్దు పెట్టుకుంటారా? అని ప్రశ్నించారు. ఈ వ్యాఖ్యలను టీఆర్ఎస్ నేత క్రిషాంక్ ట్వీట్ చేసి వైరల్ చేశారు. గవర్నర్ కూడా స్పందించాలన్నారు. ఈ అంశాన్ని సీరియస్‌గా తీసుకుని.. ఇతర నేతలు బండి సంజయ్‌పై విరుచుకుపడుతున్నారు.