కేసీఆర్ ఢిల్లీలో యుద్ధం చేయడం కాదు.. వంగి వంగి దండాలు పెట్టారని.. కేసీఆర్ ఎన్ని దండాలు పెట్టినా కేంద్రం ఊరుకోదని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ తేల్చి చెప్పారు. కేసీఆర్ ఢిల్లీ పర్యటన ముగించుకున్న రోజే బండి సంజయ్ ఢిల్లీకి వెళ్లడంతో రెండు పార్టీల మధ్య రాజీ కుదిరిందన్న ప్రచారం జరిగింది. ఈ ప్రచారం ఇమేజ్ డ్యామేజ్ చేసేలా ఉండటంతో.. బండి సంజయ్ ఢిల్లీలోనే మీడియా ముందుకు వచ్చారు. హైకమాండ్ పెద్దలతో బండి సంజయ్ ఏమైనా చర్చించారో లేదో కానీ.. ఆయన ఎంపీగా పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ సమావేశంలో పాల్గొనేందుకు ఢిల్లీ వెళ్లారు. అక్కడ ప్రెస్మీట్ పెట్టి కేసీఆర్పై ఓ రేంజ్లో విరుచుకుపడ్డారు.
కోతల కోసం కేసీఆర్ ఢిల్లీ వెళ్తారని ముందే చెప్పామని.. లోపల జరిగేది ఒకటి.. కేసీఆర్ బయట చెప్పేది ఇంకొక్కటని సంజయ్ తేల్చేశారు. కేసీఆర్ అవినీతిపై తప్పకుండా కేసులు వేస్తామని…కేసీఆర్కు చెప్పి కేంద్ర సంస్థలు దాడులు చేయవని ముందస్తు హెచ్చరికలు పంపారు. త్వరలో కేసీఆర్ జైలుకెళ్లడం ఖాయమని జోస్యం చెప్పారు. నిధుల విషయంలో కేంద్రాన్ని బద్నాం చేయడానికే కేసీఆర్ ఢిల్లీ వచ్చారని బండి సంజయ్ మండిపడ్డారు. కాళేశ్వరం మూడో టీఎంసీల పేరుతో 20 వేల కోట్ల దోపిడీకి కుట్ర చేశారని.. డీపీఆర్ లేకుండా అనుమతులుండవని కేంద్రం చెప్పిందని స్పష్టం చేసారు.
తెలంగాణలో రైతులు ఆందోళన చేయకున్నా బంద్ పిలుపు ఇచ్చారు.. ఢిల్లీలో రైతుల ఆందోళనకు కేసీఆర్ ఎందుకు వెళ్లలేదని బండి సంజయ్ ప్రశ్నించారు. ఢిల్లీలో బండి సంజయ్ స్పందన టీఆర్ఎస్ వర్గీయుల్ని షాక్కు గురి చేసింది. కేసీఆర్ ఢిల్లీ నుంచి వచ్చిన తర్వాత బీజేపీ నేతలు దాడిని తగ్గిస్తారని అనుకున్నారు. కానీ అలాంటిదేమీ లేకపోగా.. కేంద్ర దర్యాప్తు సంస్థల సోదాలు త్వరలో జరగబోతాయన్న ట్లుగా బండి సంజయ్ ప్రకటించారు. దీంతో రాజీ సంగతేమో కానీ.. వ్యవహారం మరింత ముదిరిందన్న అభిప్రాయం తెలంగాణ రాజకీయవర్గాల్లో వినిపిస్తోంది.