కేసీఆర్ రాజకీయ లవ్ జీహాద్ చేస్తున్నాడని.. వన్ సైడ్ లవ్‌ను కేంద్రం నమ్మడం లేదని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ చెబుతున్నారు. గ్రేటర్ ఎన్నికల తర్వాత ఢిల్లీ వెళ్లి వచ్చినప్పటి నుండి కేసీఆర్ తీరులో స్పష్టమైన మార్పు వచ్చింది. బీజేపీకి మిత్రపక్షంగా మారేందుకు.. ఆయన ప్రయత్నిస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. ఎన్డీఏలో టీఆర్ఎస్ చేరబోతోందన్న ప్రచారం కూడా జరుగుతోంది. దీనని బండి సంజయ్ తోసిపుచ్చుతున్నారు. కేసీఆర్‌తో కలసి పనిచేసే అవసరం తమకేముందని.. 2023లో అధికారం బీజేపీదేనని అయనంటున్నారు. రాజ్‌భవన్‌లో గవర్నర్‌ను కలిసి.. గ్రేటర్ కార్పొరేటర్లను నోటిఫై చేయాలని ఆయన విజ్ఞాపన పత్రం ఇచ్చిన తర్వాత మీడియాతో మాట్లాడారు. అప్పుడు ఇరవై, ముప్ఫై మంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నారని ప్రకటించారు.
ఆ తర్వాత పిచ్చాపాటిగా మీడియా ప్రతినిధులతో కీలక అంశాలపై స్పందించారు. ఎన్డీయేలో చేరుతామని కేసీఆర్ మభ్యపెడుతున్నారు కానీ.. కేంద్ర పెద్దలు నమ్మటం లేదని బండి సంజయ్ స్పష్టం చేశారు. తాము గేట్లు ఎత్తితే టీఆర్ఎస్ ఖాళీ అవుతుంది కానీ ఎవరిని పడితే వారిని తీసుకోబోమన్నారు. తప్పులు ఒప్పుకుని పాప పరిహారం చేసుకుంటే ఆలోచిస్తామని ఆఫర్ ఇచ్చారు. అయితే కేసీఆర్ విషయంలో కేంద్రం వైఖరి ఎలా ఉందో తెలియదు కానీ.. బండి సంజయ్ కు ఢిల్లీ నుంచి మరోసారి పిలుపు వచ్చింది. రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిణామాలపై చర్చించేందుకు బండి సంజయ్‌ను హైకమాండ్ పిలిచినట్లుగా ప్రచారం జరుగుతోంది.
20 రోజుల్లో మూడోసారి ఢిల్లీకి బండి సంజయ్ వెళ్తున్నారు. కేసీఆర్ ఢిల్లీ నుంచి వచ్చిన తర్వాత బండి సంజయ్.. వెళ్లారు. అయితే అప్పుడు… పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ సమావేశంలో పాల్గొని తిరిగి వచ్చేశారు. హైకమాండ్ పెద్దలతో చర్చలు జరపలేదు. ఇప్పుడు.. కేసీఆర్ … వ్యవసాయ చట్టాలకు మద్దతుగా ప్రకటనలు చేయడం.. ఆయుష్మాన్ భారత్ లో చేరడం.. వంటి కార్యక్రమాల ద్వారా తాను బీజేపీ పక్షమేనని చేతల ద్వారా నిరూపిస్తూండటంతో.. రాజకీయ పరిస్థితులలో మార్పులు చోటు చేసుకుంటున్న సూచనలు కనిపిస్తున్నాయి.