ముఖ్యమంత్రి కేసీఆర్ మీద ఒక విచిత్రమైన ఆరోపణ చేశారు కరీంనగర్ భాజపా ఎంపీ బండి సంజయ్..! ఈ మధ్య… మంత్రి కేటీఆర్ కాబోయే ముఖ్యమంత్రి అంటూ అధికార పార్టీలో కొంత చర్చ జరిగిన సంగతి తెలిసిందే. యువ నాయకత్వానికి సమయం వచ్చిందనీ, ధీటైన నాయకుడికి కావాల్సిన లక్షణాలన్నీ ఆయనకి ఉన్నాయంటూ కొందరు వ్యాఖ్యానించారు. అయితే, అలాంటిదేం లేదని మంత్రి కేటీఆర్ ఒకటికి రెండుసార్లు స్పష్టం చేశారు. మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ విజయం సందర్భంగా మీడియా సమావేశం నిర్వహిస్తూ కేసీఆర్ కూడా… తాను ఆరోగ్యంగా దుక్కలా ఉన్నానంటూ చెప్పారు. ఈ టాపిక్ మీద ఢిల్లీలో పార్లమెంటు ప్రాంగణంలో బండి సంజయ్ ఆసక్తికరమైన వ్యాఖ్య చేశారు. కేటీఆర్ ని ముఖ్యమంత్రి చేసే ఉద్దేశం ఆయన తండ్రి కేసీఆర్ కి లేదని అంటున్నారు!
పాలనలో లోపాలపై ప్రజలు, మీడియా దృష్టి మళ్లకుండా ఉండేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రయత్నిస్తుంటారన్నారు సంజయ్. రెండ్రోజులు హాస్పిటల్లో ఉన్నారనీ, మళ్లీ బయటకి వచ్చారన్నారు. కేటీఆర్ ని ముఖ్యమంత్రి చేయాలనే ఉద్దేశంతోనే పార్టీలో ఇంటర్నల్ సర్వే చేయించుకుని ఒక నివేదిక తెప్పించుకున్నారన్నారు. కేటీఆర్ ని ముఖ్యమంత్రిగా ఏ మంత్రీ, ఏ ఎమ్మెల్యే ఒప్పుకునేట్టు లేరని దాన్లో తేలిందని సంజయ్ చెప్పారు. కేటీఆర్ కి మొత్తం అప్పగిస్తే పార్టీ పోయేట్టుందనీ, ప్రభుత్వం కూలిపోయేట్టు ఉందని ఆయనకి తెలిసిపోయిందన్నారు. అందుకే, తాను సంపూర్ణ ఆరోగ్యవంతుడిగా ఉన్నా అంటూ విలేకర్ల సమావేశంలో కేసీఆర్ చెప్పారన్నారు. అయితే, ఈ ప్రయత్నం ఇక్కడితో ఆగకుండా ఇప్పుడో కొత్త స్కీమ్ మొదలుపెట్టారనీ… ఈయనేమో ప్రధానమంత్రి అయితా అని నాయకులతో చెప్తున్నారంటూ సంజయ్ ఎద్దేవా చేశారు. కేటీఆర్ ని ముఖ్యమంత్రిని చేస్తే… ప్రభుత్వం కూలిపోకుండా ఉండాలంటే, పార్టీ నాయకులకు తాను ప్రధాని అవుతాననే భరోసా ఇస్తున్నారన్నారు. దీని కోసం తప్ప తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చెయ్యాలనే ఆలోచన ముఖ్యమంత్రికి లేదని ఆరోపించారు సంజయ్.
కేటీఆర్ కాబోయే సీఎం అనే అంశానికి ఎలాగోలా ఫుల్ స్టాప్ పెట్టే ప్రయత్నమే తెరాస చేసింది. కానీ, ఇప్పుడీ కోణంలో కేసీఆర్, కేటీఆర్ ల మీద సంజయ్ ఆరోపణలు చేయడంతో… దీనిపై తెరాస నేతలు ఎవరో ఒకరు స్పందించే అవకాశం మళ్లీ ఉందనే చెప్పాలి. అంటే, మరోసారి కేటీఆర్ కాబోయే ముఖ్యమంత్రి అనే టాపిక్ చర్చకు వచ్చేలానే ఉంది.